calender_icon.png 26 October, 2024 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులు

01-07-2024 12:05:00 AM

  • ఆటో సేల్స్, ఎఫ్‌పీఐ యాక్టివిటీ, ఫెడ్ మినిట్స్‌పై ఇన్వెస్టర్ల దృష్టి

ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల అంచనాలు

ముంబై, జూన్ 30: అనూహ్యంగా ఉన్నత శిఖరాల్ని అవలీలగా అధిగమించి సరికొత్త రికార్డులను నెలకొల్పిన స్టాక్ సూచీలు జూన్ 28తో ముగిసిన వారంలో 2 శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ గతవారం 1,822 పాయింట్లు లాభపడి 79,032 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 522 పాయింట్లు ర్యాలీ జరిపి 24,010 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.  అంతర్జాతీయంగా లేదా దేశీయంగా మార్కెట్‌ను ప్రభావితం చేయగల అంశాలేవీ లేనప్పటికీ, జూన్ డెరివేటివ్ సిరీస్ ముగింపు సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్లు డెరివేటివ్స్ విభాగంలో భారీగా ఉన్న షార్ట్ పొజిషన్లను కవర్‌చేసుకోవడంతో గత వారం ర్యాలీ జరిగిందని విశ్లేషకులు చెపుతున్నారు. 

జూలై సిరీస్ ప్రారంభరోజులైనందున, అటు అమ్మకాలు, ఇటు కొనుగోళ్లకు పురికొల్పే ట్రిగ్గర్లు లేనందున ఈ వారం మార్కెట్ పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతుంద ని అంచనా వేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  ట్రేడింగ్ శ్రేణి 23,350 పాయింట్ల మధ్య నిర్ణీతశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. ఈ కదలికల ఆధారంగా చూస్తే వచ్చే వారంలో నిఫ్టీ పరిమితశ్రేణిలో కన్సాలిడేట్ అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూన్ నెల ఆటోమొబైల్ అమ్మకాల గణాంకాలు, విదేశీ పోర్ట్‌ఫో లియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల లావాదేవీలు, రుతుపవనాల గమనం తదితర దేశీయ అంశాలు ఈ వారం మార్కెట్‌ను స్వల్ప హెచ్చుతగ్గులకులోను చేస్తాయన్నారు.

ఈ వారం విడుదలకానున్న భారత్, యూస్‌ల తయారీ పీఎంఐ డేటా, ఫెడరల్ రిజర్వ్ సమావేశపు మినిట్స్, ఫెడ్ చైర్మన్ ప్రసంగంలో వెలువడే సంకేతాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ హెడ్  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ ఖెమ్కా చెప్పారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌పై అంచనాలతో రంగాలవారీగా ఎంపికచేసిన షేర్లపై బుల్స్ దృష్టిపెడతారని, మార్కెట్ తగ్గుదలను కొనుగోళ్లకు ఉపయోగించుకుంటారని, ర్యాలీ జరిగితే లాభాల స్వీకరణకు దారితీస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీంతో సూచీల కదలికల శ్రేణి పరిమితంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వారం మార్కె ట్‌ను ప్రభావితం చేసే అంశాలు..

రూపీ వర్సస్ డాలర్

డాలరు మారకంలో రూపాయి విలువ రికార్డు కనిష్ఠస్థాయి 83.69 వద్దకు గతవారం మరోదఫా తగ్గినందున ఇన్వెస్టర్లు రూపాయి/డాలర్ పెయిర్ కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తారని అనలిస్టులు భావిస్తున్నారు. శుక్రవారం ఇది 83.34 స్థాయికి కోలుకున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో డాలరు బలపడటం, క్రూడ్ ధరల పెరుగుదల కారణంగా రూపాయి బలహీనంగానే ట్రేడవు తుందని ఫారిన్ ఎక్సేంజ్ ట్రేడర్లు చెప్పా రు. ఈ వారం రూపాయి 83.20 రేంజ్‌లో ట్రేడ్‌కావచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కరెన్సీ అనలిస్ట్ అనూజ్ చౌదరి అంచనా వేస్తున్నారు. 

ఫెడ్ మీట్ మినిట్స్

జూన్ రెండోవారంలో జరిగిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ జూలై 5న వెలువడతాయి. రానున్న నెలల్లో వడ్డీ రేట్ల తగ్గింపు అంశమై ఫెడ్ అధికారుల సంకేతాలకోసం ప్రపంచ మార్కె ట్లు ఈ మినిట్స్‌పై దృష్టి నిలుపుతాయని, అలాగే జూలై 2న ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ చేసే ప్రసంగంలో వెల్లడయ్యే సంకేతాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు తెలిపారు. ఈ వారం యూఎస్ నుంచి వెలువడే ఎస్ అండ్ పీ గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ, నిరుద్యోగం రేటు, జాబ్‌లెస్ క్లెయింలు తదితర డేటా సైతం మార్కెట్లకు ప్రధానమని చెప్పారు. 

ఆటో సేల్స్

జూలై 1న వెల్లడయ్యే నెలవారీ ఆటో సేల్స్ గణాంకాలపై ప్రస్తుతం మార్కెట్ దృష్టి ఉన్నది. వివిధ ఆటో విభాగాలపై మిశ్రమ అంచనాలు నెలకొన్నాయి. జూన్ నెలలో పాసింజర్ వాహన విక్రయాలు, ద్విచక్ర వాహన విక్రయాలు పెరుగుతాయని, వాణిజ్య వాహన అమ్మకాల వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని, ట్రాక్టర్ల అమ్మకాలు తగ్గుతాయన్న అంచనాలు ఉన్నాయి. టూవీలర్స్ హై సింగిల్ డిజిట్‌లోనూ, పాసింజర్ వెహికిల్స్ లో సింగిల్ డిజిట్‌లోనూ వృద్ధిచెందుతాయని నువమా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేస్తున్నది.

ఎఫ్‌పీఐ పెట్టుబడులు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) కార్యకలాపాలు మార్కెట్ కదలికల్ని నిర్దేశిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. గతవారం ఎఫ్‌పీఐలు రూ. 14,700 కోట్ల విలువైన షేర్లను క్యాష్ విభాగంలో విక్రయించగా, దేశీయ సంస్థలు రూ. 20,796 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. జేఎం మోర్గాన్ బాండ్ ఇండెక్స్‌లో ఇండియాను చేర్చిన నేపథ్యంలో జూన్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ.26,565 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ కారణంగా  దేశీయ స్టాక్ మార్కెట్‌ను ఎఫ్‌పీఐల పెట్టుబడుల శైలి ప్రభావం చూపుతుందని విశ్లేషకులు తెలిపారు. యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగకపోతే, ఎఫ్‌పీఐల కొనుగోళ్లు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. 

నిఫ్టీ నిరోధం 24,200 - మద్దతు 23,800

గతవారం తొలి నాలుగురోజులు అప్‌మూవ్ జరిపిన నిఫ్టీకి శుక్రవారం కొత్త గరిష్ఠస్థాయి వద్ద లాభాల స్వీకరణ ఒత్తిడి ఏర్పడిందని, ఫలితంగా డెయిలీ చార్టుల్లో చిన్న నెగిటివ్ క్యాండిల్ ఏర్పడిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ నాగరాజ షెట్టి తెలిపారు. ఈ ఫార్మేషన్ గరిష్ఠస్థాయిలో నెగిటివ్ సెట్‌అప్‌ను సూచిస్తున్నదన్నారు. ఈ కారణంగా  నిఫ్టీకి 24,200 పాయింట్ల వద్ద ఎదురయ్యే నిరోధం కీలకమని, 23,800 పాయింట్ల వద్ద మద్దతును కోల్పోతే బలహీనపడుతుందని అంచనా వేశారు. 24,200 స్థాయిపైన స్థిరపడితే అప్‌ట్రెండ్ కొనసాగుతుందన్నారు. బ్యాంక్ నిఫ్టీకి 52,000 పాయింట వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నదని, 52,700 జోన్ అవరోధం కల్పించవచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ డెరివేటివ్ అనలిస్ట్ కునాల్ షా విశ్లేషించారు.