ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్
ముంబై, డిసెంబర్ 26: గత ట్రేడింగ్ సెషన్ తరహాలోనే గురువారం కూడా స్టాక్ మార్కెట్ పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. బుధవారం క్రిస్మస్ సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా, మంగళ వారంనాటి తీరులోనే స్టాక్ సూచీలు లాభాలతో ప్రారంభమైనప్పటికీ, రోజంతా ఒడిదు డుకులకు లోనయ్యాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ తొలిదశలో 78,898 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరిన అనంతరం 78,173 కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు 78,472 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. 23,854-23,653 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 22 పాయింట్లు లాభపడి 23,750 పా యింట్ల వద్ద నిలిచింది.
మంగళవారం సూ చీలు రెండూ స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఈ ఏడాది డెరివేటివ్ కాంట్రాక్టులకు చివరి ముగింపురోజైన డిసెంబర్ 26న మార్కెట్‌ను కదల్చగల ట్రిగ్గర్లు ఏవీ లేనందున, రోజంతా దాదాపు ఫ్లాట్‌గా ట్రేడయ్యిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
కొనసాగిన ఎఫ్‌పీఐల విక్రయాలు
మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ.2,376 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వరుసగా గత ఏడు రోజుల్లో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్న పెట్టుబడులు రూ. 18,000 కోట్లకు చేరాయి.
వెలుగులో అదానీ గ్రూప్ షేర్లు
మార్కెట్ నిస్తేజంగా ముగిసినప్పటికీ, అదానీ గ్రూప్‌లోని పలు షేర్లు ర్యాలీ జరిపాయి. ఈ గ్రూప్ కంపెనీ అయిన అదానీ పోర్ట్స్ సెన్సెక్స్-30 ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా 5 శాతం పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజు కి, సన్‌ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్ 1 శాతంపైగా లాభపడ్డాయి.
మరోవైపు టైటాన్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో, లార్సన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా సర్వీసెస్ ఇండెక్స్ 1.80 శాతం పెరిగింది.
ఆటోమొబైల్ ఇండెక్స్ 0.81 శాతం, పవర్ ఇండెక్స్ 0.45 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.45 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.23 శాతం చొప్పన లాభపడ్డాయి. కమోడిటీస్, ఇండస్ట్రియల్స్, టెలికమ్యూనికేషన్, మెటల్ సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.24 శాతం తగ్గగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగింది.