20 మంది మృతి, 30 మంది గల్లంతు
వంతెన కుప్పకూలి మరో 12 మంది దుర్మరణం
సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిన్‌పింగ్ ఆదేశం
బీజింగ్, జూలై 21 : భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండ్రోజులగా ఉత్తర, దక్షిణ చైనాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 20 మంది మృతి చెందారు. దాదాపు 30 మందికి పైగా గల్లంతయ్యారు. వాయువ్య షాంగ్సీ ప్రావిన్స్‌లో ఒక వంతెన కుప్పకూలడంతో 17 కార్లు, 8 ట్రక్కులు నీటిలో పడిపోయాయి. 12 మంది మరణించారు. నదిలో పడిపోయిన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని యాన్ పట్టణంలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి 30 మందికి పైగా గల్లంతయ్యారు. షాంగ్సీ బావోజీ సంభవించిన వరదల్లో ఐదుగురు మరణించారని, 8 మంది తప్పిపోయారని ఆ దేశ మీడియా పేర్కొంది. సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి శుక్రవారం ఇద్దరు వ్యక్తులు మరణించారు, ఏడుగురు తప్పి పోయారు.