calender_icon.png 15 January, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీని ముంచిన వరదలు

05-09-2024 01:07:35 AM

  1. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.5 కోట్లకు పైగా నష్టం 
  2. ప్రధాన మార్గాల్లో బస్సులు బంద్

ఖమ్మం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు టీజీఎస్‌ఆర్టీసీకీ కూడా పెద్ద ఎత్తున నష్టం కలిగించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందులలో ఆర్టీసీ డిపోలున్నాయి. మొత్తం 1,400మంది కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర అన్ని రకాల సిబ్బంది పనిచేస్తున్నారు. మొత్తం 530 బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సులన్నీ నిత్యం 2 లక్షల 40 కిలో మీటర్ల మేర తిరుగుతూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. అయితే ఒక్కసారిగా వచ్చిన వరదలతో రోడ్లు, వంతెనలు దెబ్బతిని బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.

ఆదాయం ఎక్కువుగా లభించే ఖమ్మం  హైదరాబాద్, ఖమ్మం  కోదాడ, ఖమ్మం  సూర్యాపేట మార్గాల్లో గత ఆదివారం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్క ఆదివారం రోజునే రూ.కోటికి పైగా సంస్థకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు  ఖమ్మం  బోనకల్ మార్గంలో కూడా బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోనకల్ మార్గంలో నాగులవంచ వద్ద వాగు పొంగి రోడ్డుమీద నుంచి ప్రవహించడంతో బస్సులు వెళ్లలేని పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఆదివారం నుంచి చాలా ప్రాంతాలకు బస్సుల రాకపోకలు బంద్ కావడంతో 80 శాతం నష్టాలు వచ్చాయి. దాదాపు రూ.5 కోట్ల నష్టం వచ్చినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. 

రక్షణ చర్యలు తీసుకున్నాం: ఖమ్మం ఆర్‌ఎం సరిరామ్ 

గత ఆదివారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల నేపథ్యంలో సంస్థాగతంగా అన్ని రక్షణ చర్యలు తీసుకున్నాం. వరద ప్రభావిత ప్రాంతాలకు ముందస్తుగా బస్సు సర్వీసులను నిలిపేశాం. ప్రధాన మార్గాల్లో బస్సులు నడవకపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇబ్బంది లేని మార్గాల్లో బస్సులను నడిపాం.