calender_icon.png 2 October, 2024 | 6:02 PM

రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

05-09-2024 01:22:57 AM

ప్రధానికి ఎంపీ చామల విజ్ఞప్తి 

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఎంతో నష్టం జరిగిందని, కేంద్రం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణకు ప్యాకేజీని విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా తెలంగాణలో పర్యటించి వాస్తవాలను, జరిగిన నష్టాన్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశా రు. బుధవారం గాంధీభవన్‌లో  పీసీసీ అధికార ప్రతినిధులు భవానీరెడ్డి, లింగంయా దవ్, వచన్‌కుమార్, సంధ్యారెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

కేటీఆర్‌కు వానలు, వరదలు వచ్చినా పట్టదని, ఎక్స్‌లోనే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారో ఎవరికీ తెలియదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని బుల్డోజ్ పాలనపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణలో హైడ్రాపై హైకోర్టు తీర్పు ఇచ్చినట్లుగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాను బుల్డోజర్‌తో పోల్చి తికమక చేయవద్దన్నారు. బీఆర్‌ఎస్‌లో రెండు గ్రూప్‌లు ఉన్నాయని, ఖమ్మంలో ఆ రెండు గ్రూపులు కొట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ దయా దక్షిణ్యాలతో గెలిచిన బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు.