calender_icon.png 20 September, 2024 | 3:05 PM

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద పోటు

27-07-2024 12:05:00 AM

కృష్ణ, తుంగభద్ర నుంచి భారీగా జలాలు

హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి, జూలై 26 (విజయక్రాంతి): ఎగువన కురుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ సీజన్‌లో అత్యధికంగా 100 టీఎంసీలకు మించి వరద వచ్చి చేరింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి వరద భారీగా వస్తుండడంతో అధికారులు విద్యుత్ ఉత్పత్తికి 45,236 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు వరద పో టు తగలడంతో అధికారులు ఆ జలాలను జూరాల ప్రాజెక్ట్‌కు వదులుతున్నారు. గోదావరి బేసిన్‌లోనూ నది ప్రవాహ ఉధృతి ఉం ది. ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వరద గో దావరిలో చేరుతుండడంతో దుమ్ముగూడెం వద్ద 11,00,742 క్యూసెక్కుల వరద నమోదైంది.

బాబ్లీ ప్రాజెక్టు నుంచి కేవలం 25 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 30 టీఎంసీల లోపే ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం కాళేశ్వరం వద్ద 103.39 మీటర్ల మేర ప్రవా హం ఉంది. రామన్నగూడెం వద్ద 15.910 మీటర్ల మేర ప్రవహిస్తున్నది. దీంతో ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది.

మేడిగడ్డకు తగ్గని వరద..

ఎగువన కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్‌లోకి భారీగా వరద చేరుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి బరాజ్ వద్ద 9.89 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 85గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు జలాలు వదులుతున్నారు.

జల దిగ్బంధంలో పల్లెలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 27 (విజయక్రాంతి): వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహితలోకి భారీగా వరద చేరుతోంది. ఫలితంగా వంతెనలు, చప్టాలపై వరద ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని చింతల మానేపల్లి మండలంలోని దిందా,బాబాసాగర్, నాగపూర్,శివపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. దాహెగాం మండలంలోని మెట్లగూడలోని ఎస్సీ, బీసీ కాలనీలు, సాగులో ఉన్న పంటలు ముంపునకు గురయ్యాయి. కాగజ్‌నగర్ పట్టణంలోని గంగారాం బస్తీకి చెందిన తాండ్రా కోమురయ్య ఇంటి గోడ కూలి తీవ్రగాయాల పాలై మృతిచెందాడు. సిర్పూర్(టి) మండలం హుడికిలిలో పెనుగంగ బ్యాక్ వాటర్‌లో చిక్కుకున్న గోపాల్‌ను ఎస్సై దీకొండ రమేష్ సిబ్బందితో కలిసి కాపాడారు.