- ఎగువ నుంచి 5 లక్షల క్యూసెక్యుల ఇన్‌ఫ్లో
- ప్రాజెక్టు 26 క్రస్టుగేట్ల నుంచి నీటివిడుదల
నల్లగొండ, (విజయక్రాంతి) : నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. కృష్ణా బేసిన్‌లో కురిసిన వర్షాలకు నదిలో ప్రవాహం భారీగా పెరిగింది. ఇప్పటికే బేసిన్ పరిధిలోని ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు నిండడంతో క్రస్టుగేట్టలను తెరిచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. దీంతో సాగర్కు 5 లక్షల 20 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుంది.
వరదను ఎప్పటికప్పడు అంచనా వేస్తున్న అధికారులు ప్రాజెక్టు 26 క్రస్టుగేట్లలో 10 గేట్లను 10 అడుగులు, 16 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 4.92 లక్షల క్యూసెక్కులు స్పిల్ వే గుండా నదిలోకి వదులుతున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ మరో 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుంచి ఎడమ, కుడి, ఏఎమ్మార్పీ (ఎస్ఎల్‌బీసీ) కాల్వలకు 8 వేల క్యూసెక్కులు వెళ్తోంది. ఎగువ నుంచి ప్రవాహం పోటెత్తుతుండడంతో ప్రాజెక్టు బఫర్ (ఖాళీని) పెంచారు. ఇప్పటికే నీటిమట్టాన్ని రెండు అడుగుల మేర తగ్గించారు. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.9 అడుగులు గా ఉంది.