calender_icon.png 25 March, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరుగుల వరద

24-03-2025 12:40:35 AM

ఉప్పల్‌లో చెలరేగిన సన్‌రైజర్స్

  1. ఇషాన్ కిషన్ సెంచరీ.. రాజస్థాన్‌పై ఘన విజయం
  2. రెండు జట్లు కలిసి బాదిన పరుగులు 528

హైదరాబాద్, మార్చి 23: హోంగ్రౌండ్ ఉప్పల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పరుగుల వరద పారించింది. హైదరాబాద్ బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు. 44 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను మట్టికరిపించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 67 (31 బంతుల్లో) విధ్వంసం సృష్టించగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ 106 నాటౌట్ (47 బంతుల్లో) రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హెన్రిచ్ క్లాసెన్ 34 (14), నితీశ్‌కుమార్‌రెడ్డి 30 (15), అభిషేక్ శర్మ 24 (11) కూడా మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 3, మహీశ్ తీక్షణ 2, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు అతడి ఖాతాలో చేరింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 242 పరుగులకు పరిమితమైంది. ధ్రువ్ జురెల్ 70 (35), సంజు శాంసన్ 66 (37) పోరాటం చేశారు. యశస్వి జైస్వాల్ (1), రియాన్ పరాగ్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.

చివర్లో షిమ్రాన్ హెట్‌మయర్ 42 (23), శుభమ్ దూబె 34 నాటౌట్ (11) ధాటిగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా రెండు జట్లు కలిసి 528 భారీ పరుగులు సాధించాయి. హైదరాబాద్ బౌలర్లలో సిమర్‌జిత్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, మహ్మద్ షమి, ఆడమ్ జంపా ఒక్కో వికెట్ తీసుకున్నారు.

స్కోర్ బోర్డ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ : 286/ 6 (20 ఓవర్లు)

రాజస్థాన్ రాయల్స్ : 242/ 6 (20 ఓవర్లు)

ముంబైపై చెన్నై విజయం

చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. 4 వికెట్ల తేడాతో ముంబైపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్‌వర్మ 31 (25 బంతులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

సూర్యకుమార్ యాదవ్ 29 (26 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. చివర్లో దీపక్ చాహర్ 28 (15) మెరుపులు మెరిపించడంతో స్కోర్ బోర్డు 150 పరుగులు దాటింది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 3, రవిచంద్రన్ అశ్విన్, నాథన్‌ఎల్లిస్ తలో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఛేజింగ్ ప్రారంభించిన చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 53(26) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రచిన్ రవీంద్ర 65 నాటౌట్ (44) పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంకా అయిదు బంతులు మిగిలుండగానే చెన్నై విజయం ఖరారైంది. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్ 3 వికెట్లతో రాణించగా, విల్ జాక్స్, దీపక్ చాహర్, చెరో వికెట్ తీశారు.

స్కోర్ బోర్డు

ముంబై: 155/ 9 (20 ఓవర్లు)

చెన్నై: 158/ 6 (19.1 ఓవర్లు)