calender_icon.png 23 September, 2024 | 12:46 AM

సీఎం నోటి నుంచి అబద్ధాల వరద

16-09-2024 05:05:00 AM

  1. రైతుల కళ్లలో కన్నీళ్లు తెప్పించావ్
  2. నేను నీ గుండెల్లో నిద్ర పోతున్నా
  3. సగం రుణమాఫీ చేయించా
  4. మిగతాది చేసే దాకా వదిలిపెట్ట
  5. ఐదేళ్లకు మించి కాంగ్రెస్ పాలించలే
  6. రుణమాఫీ ఎక్కడైంది..?  
  7. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాకి పోదామా? లేదా మా సిద్దిపేట వెంకటాపురం పోదామా?
  8. సగం రుణమాఫీ చేయించా.. మిగతాది చేసే దాకా వదిలపెట్టను 
  9. ఐదేళ్లకు మించి ఎక్కడా కాంగ్రెస్ అధికారంలో లేదు
  10. సీఎం కుర్చీకన్నా మర్యాద ఇవ్వు
  11. సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్

హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి అబద్ధాల వరద పారుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమె త్తారు. రైతుల కళ్లలో ఆనందం కాకుండా, కన్నీళ్లు తెప్పించారని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్, గ్యరెంటీలు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై  తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.

గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా బీఆర్‌ఎస్, హరీశ్ రావుపై సీఎం చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. రెండు లక్షలకు పైగా రుణం ఉన్న వాళ్లు మిగతా సొమ్ము కడితే వెంటనే అప్పు మొత్తం మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కానీ ఎవరికి కూడా మాఫీ కాలేదన్నారు. రుణ మాఫీ విషయంలో మంత్రులు ఓ మాట, సీఎం ఓ మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం నోటి కంపు.. మోరీల కంపు ను మించి పోయిందని విమర్శించారు.

సీఎం కుర్చీ మీద కూర్చున్నా అనే సోయి లే కుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయనకు కాకున్నా..సీఎం కుర్చీకన్నా మర్యాద ఇవ్వాలని రేవంత్ అం టున్నారని  పేర్కొన్నారు. సీఎం కుర్చీకి ఉన్న మర్యాదను ఆయన కాలరాశారని విమర్శించారు. సీఎం వాడే భాషపై కూడా హరీశ్ అభ్యంతరం తెలిపారు. రేవంత్ మాట్లాడిన భాషలోనే జవాబు ఇవ్వడం తనకు నిమిషం పని అని, కానీ అలా మాట్లాడటానికి తనకు విజ్ఞత అడ్డు వస్తుందని చెప్పారు. 

నా గురించి ఆలోచించడం మానెయ్.. 

పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఐదేళ్లకు మించి కాంగ్రెస్ పాలించలేదన్నారు. ఇక్కడ కూడా అదే జరగబోతోందన్నారు. తనను రేవంత్ రెడ్డి పదే పదే తిడితున్నారని, తాను సన్నాసి అని తిట్టడం ఎంతసేపు అని వ్యాఖ్యానించారు. తాను తాటిచెట్టంత ఎదిగిన మాట వాస్తవమేనని, కానీ రేవంత్ రెడ్డి వెంపలి చెట్టంత కూడా ఎదుగలేదని సెటైర్ వేశారు. తాన ఎంత ఎత్తు  ఉంటే ఆయనకెందుకని, తన గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించాలని సూచించారు. రుణమాఫీ చేయలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

సీఎం దుర్మార్గ నిబంధనల వల్ల రైతు సురేందర్ రెడ్డి ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పూర్తి చేశా అని సీఎం మాట్లాడుతున్నారని, నిజంగా మొత్తం అప్పు మాఫీ అయిందని నిరూపిస్తావా అని ప్రశ్నించారు. ఎక్కడికి పోదాం? నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాకి పోదామా? లేదా మా సిద్దిపేట వెంకటాపురం పోదాం? అని సవాల్  విసిరారు. సీఎం ఫెయిల్యూర్ కావడం వల్లే రైతు ఆత్మహత్య జరిగిందన్నారు. 31 వేల కోట్లలో సగం కూడా రుణమాఫీ కాలేదని  ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది రైతుల్లో 20 లక్షల మందికే రుణం మాఫీ అయ్యిందని చెప్పారు. గతంలో రేషన్ కార్డు నిబంధన లేదని చెప్పి ఇప్పుడు అదే కార్డును సాకుగా చూపిస్తున్నారని తెలిపారు. తాను ఎక్కడ దాక్కున్నానని  రేవంత్ పదేపదే అంటున్నారని,  తాను రేవంత్ గుండెల్లో నిద్ర పోతున్నానని ఆయన చెప్పారు.  ఆయన్ను నిద్ర పట్టనీయకుండా చేసి సగం రుణమాఫీ చేయించానని, మిగతా సగం చేయించే దాకా వదిలిపెట్టబోనని హెచ్చరించారు. తాను రోజూ రేవంత్‌రెడ్డి వెంట పడుతున్నానని చెప్పారు. 

ఇంతకు గాంధీ ఎవరి వాడు.. 

అసలు ఫోర్త్ సిటీ ఎక్కడుందో రేవంత్ చెప్పాలని హరీశ్ నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ కృషి చేసి రూ. 1500 కోట్లు ఖర్చుపెట్టి 12 వేల ఎకరాలను ఫార్మాసిటీ కోసం సేకరించారని, కానీ సీఎం అక్కడ రియల్ ఎస్టేట్  వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం పదవి ఇజ్జత్ తీస్తున్నావని రేవంత్‌పై ఫైర్ అయ్యారు. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి తన పరువును ఆయనే తీసుకుంటున్నారని అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడింది చూస్తే కౌశిక్‌రెడ్డి ఇంటిపై ఆయనే దాడి చేయించిన విధంగా ఉందన్నారు. శ్రీధర్ బాబు..

గాంధీని కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదని, అంటున్నారని, రేవంత్ మాత్రం ఆయన తమ వాడే అంటున్నారని చెప్పుకొచ్చారు. అసలు గాంధీ ఎవరి వారని ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం తెగ కష్టపడ్డామని రేవంత్ అంటున్నారని, బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పనిని కూడా వారే చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ట్రిపుల్ ఆర్ నార్త్ సైడ్‌కు తాము అనుమతులు తెచ్చామని, సౌత్ సైడ్‌కు కాంగ్రెస్ చేయించి నిరూపించుకోవాలన్నారు. 

హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటున్నది..

రేవంత్‌రెడ్డి వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని, తొమ్మిది నెలల్లో తొమ్మిది మత కలహాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఉచిత కరెంట్‌ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై  హరీశ్ రావు మండిప్డడారు. నాడు ఇచ్చింది ఉచిత కరెంట్ కాదని, ఉత్తిత్తి కరెంట్ అని ఎద్దేవా చేశారు. నాడు ఏడు గంటలు అని చెప్పి రాత్రిపూటు నాలుగైదు గంటలు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ అని అన్నారు.

కేసీఆర్ హయాంలోనే టీచర్ల బదిలీలు..

 బీఆర్‌ఎస్ సర్కారు టీచర్ల ట్రాన్స్‌ఫర్లు చేయలేదని సీఎం ఆరోపణలు చేశారని, ఇది పచ్చి అబద్ధమమన్నారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం టీచర్ల బదిలీలను చేపట్టినట్లు పేర్కొన్నారు. స్కూళ్లకు ఉచిత కరెంట్ అంటూ సీఎం మాట్లాడుతున్నారని, ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. తమ ప్రభుత్వం స్కూళ్లకు గ్రాంట్స్ ఇచ్చేదని, వాటితో విద్యుత్ బిల్లు కట్టే వారని చెప్పారు. ఇప్పుడు సీఎం ఆ గ్రాంట్స్‌ను కట్ చేసి.. నేరుగా చెల్లిస్తున్నారని, ఇందులో కొత్తదనం ఏముందని ఆయన ప్రశ్నించారు.