హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): నగరంలో, జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీలో జరిగిన ప్రజావాణిలో 174 దరఖాస్తులను అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతి స్వీకరించారు.
యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతు కే జండగే కలెక్టరేట్ లో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యలపై 65 మంది ఆర్జీలు అందజేశారు.
మెదక్: కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 144 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.
సిద్దిపేట: కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సిద్దిపేట అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి దరఖా స్తులు స్వీకరించారు. మొత్తం 66 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దుబ్బాక ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రామల్లు ఆధ్వర్యంలో జర్నలి స్టులు ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు.
రంగారెడ్డి: కలెక్టరేట్‌లోని సమీకృత సమావేశ మందిరంలో కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 120 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.