02-09-2024 03:07:51 AM
ఖమ్మం జిల్లా కకావికలం
రాష్ట్రంలో జలవిలయం.. ఆకాశానికి చిల్లు పడినట్లుగా రెండురోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. నదులు, వాగులు, వంకలు ఏకమై ప్రళయ గర్జన చేస్తున్నాయి. ఆనకట్టలను, అడ్డుకట్టలను, రోడ్లను, రైల్వే ట్రాక్‌లను వరదలు తుడిచిపెట్టేస్తున్నాయి. ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఖమ్మం జిల్లాలో పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రజలు సహాయం కోసం అల్లాడున్నారు.
వరద ప్రమాదాల్లో ౧౦ మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించటంతో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఉద్యోగులు, అధికారులకు సెలవులు రద్దుచేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అన్నిరకాల విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇతర జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): వరదల దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా ౨౨౦ జలాశయాలు, కాల్వలు దెబ్బతిన్నాయి. వరద పరిస్థితిని ఆదివారం ఉదయం నుంచే సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుక్షణం సమీక్షించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులకు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు.
ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని, అధికారులు అణుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిం చారు. అనేక జిల్లాల్లో పలు గ్రామాలు, పల్లెలు, నివాస ప్రాంతాలు, కాలనీలు నీటిలో తేలుతుండటంతో బాధితులను కాపాడేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. సోమవారం కూడా చాలా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. రోడ్లు ధ్వంసం కావటంతో పలు ప్రధాన మార్గాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలు తెగిపోయాయి.
ఖమ్మం జిల్లా కన్నీరు
భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం నీటిలో చిక్కుకున్నది. ఖమ్మం పట్టణంలో అత్యధిక భూభాగంలోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. ఖమ్మం ఐటీ హబ్‌లోకి వరద నీరు చేరింది. కొత్తగూడెం జిల్లా మణుగూరులో పలు కాలనీలు నీటిలో మునిగాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసలపల్లి సమీపంలో దాదాపు 100 మీటర్ల వరకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. రైల్వే విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. మహబూబాబాద్‌లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. దీంతో వరంగల్ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దు చేయడమో.. దారి మళ్లించడమో చేస్తున్నారు.
ఖమ్మ పట్టణం 16వ డివిజన్ అగ్రహారంలో కొత్తూరు చెరువు కట్ట తెగి రైలు పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో కొత్త కాలనీ నీళ్లలో మునిగిపోయింది. మున్నేరుకు భారీ వరద రావడంతో 25 అడుగుల మేర నీరు ప్రవహిస్తూ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. జలగం నగర్, ఆర్టీసీ కాలనీతోపాటు మున్నేరును ఆనుకుని ఉన్న కాలనీలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కవిరాజ్‌నగర్ కాలనీ, ఇల్లందు క్రాస్ రోడ్డు, జేసీ మాల్, సీఎంఆర్ షాపింగ్ మాల్, కోర్టు ఎదురు ప్రాంతం, మైసమ్మ గుడి వెనక ప్రాంతం, ఎస్సార్ కాలేజ్, నాగార్జున ఫంక్షన్ హాల్ తదితర ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తింది.
ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిందని ఆగ్రహించిన ఖమ్మం త్రీటౌన్ ప్రాంత వాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాల్వంచ మండలం ఉలవనూరు పరిధిలోని బ్రిడ్జి కొట్టుకుపోయింది. పాల్వంచ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బూర్గంపాడు మండలం ఊర్లదోసపాడులో పాలవాగు ఉధృతికి 30 పశువులు కొట్టుకుపోయాయి. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద వరదను చూసేందుకు వచ్చిన బాలుడు ఆ వరదలో కొట్టుకుపోయాడు. బన్నీ, మధు, వీరబాబు, గోపి అనే మరో నలుగురు కూడా గల్లంతైనట్లు సమాచారం. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో వరద ధాటికి భార్యాభర్తలు కొట్టుకుపోయారు. వారి కుమారుడిని అతికష్టంమీద అధికారులు కాపాడారు.
అన్ని జిల్లాలో జల ఖడ్గమే..
సీఎం, మంత్రుల పర్యవేక్షణ
వరదలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, సీతక్క, పొంగులేటి, దుద్దిళ్ల, పొన్నం, కోమటిరెడ్డి, జూపల్లి తదితరులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు సూచనలు, ఆదేశాలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తూ వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సూచనలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
దెబ్బతిన్న 220 జలాశయాలు
భారీ వర్షాలకు చెరువులు, కాల్వలు, ప్రాజెక్టులు, కుంటలు కలిపి మొత్తం 220 వరకు దెబ్బతిన్నాయి. 67 చెరువులకు భారీగా నష్టం వాటిల్లగా.. 98 చెరువులకు గండ్లు పడ్డాయి. 55 సాగు నీటి ప్రాజెక్టులు మరమ్మతులకు గురయ్యాయి. కొన్నింటికి తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. దెబ్బతిన్న జలశయాలకు మరమ్మతులు చేయటానికి రూ.629.70 కోట్లు అవసరమని అధికారులు లెక్కగట్టారు. తాత్కాలిక మరమ్మతులకే రూ.221.98 కోట్లు అవసర మని తేల్చారు. 52 జలాశయాలకు తాత్కాలిక/పర్మినెంట్ మరమ్మతులు పూర్తయ్యాయి. 22 చెరువులు, కుంటలకు పనులు కొనసాగుతున్నాయి. మరో 126 చెరువులు, కెనాల్స్, ప్రాజెక్టులు, కుంటలకు మరమ్మతులు చేయాల్సి ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
మరో 24 గంటలు అప్రమత్తం
సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారు లు సూచించారు. రెండు రోజులుగా భారీ వర్షాలకు నివాసాలు నాని ఉండటంతో పాత ఇండ్లల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీచేసింది. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నల్లగొండ, మహబూబా బాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లాల అధికారులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపుల తో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.