భధ్రాద్రి కొత్తగూడెం(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాల్టీలో జలప్రళయం సృష్టించింది. సుమారు 7 గంటల పాటు వర్షం విళయ తాండవం సృష్టించడంతో జనావాసాల్లోకి భారీగా వరదనీరు చేరింది. గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి ప్రజలు ప్రాణభీతికి గురయ్యారు. పట్టణం గుండా ప్రవహించే కోడిపుంజులవాగు, కట్టువాగు మహ ఉగ్రరూపం దాల్చాయి. శనివారం రాత్రి 9.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల 13 సెంటిమీటర్ల వర్షం కురియడంతో మణుగూరు చరిత్రలో రికార్డుగా నిలిచింది.
సుందరయ్య నగర్, బాలాజీ నగర్, ఆదర్శనగర్, శ్రీశ్రీనగర్, మేదర్‌బస్తీ దిగువ ప్రాంతం వాగు మల్లారం, మామిడిచెట్ల గుంపు ప్రాంతాలన్ని జలదిగ్బంధమయయ్యాయి. అశ్వాపురం మండలంలో వాగులు, వంకలు ఉప్పొంగాయి. దీంతో మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, ప్రదాన రహదారిపై వరదనీరు చేరుకొంది. మణుగూరులోని ఎస్సీ బాలుర వసతి గృహం వెనుక భాగంంలో కోడిపుంజుల వాగు ప్రవాహాల్లో చిక్కుకున్న వారిని బోటు సహయంతో రెస్క్యూ టీం కాపాడింది. ఎస్సై మేడ ప్రసాద్ టీమ్ దాదాపు 15కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాగు మల్లారం, సుందరయ్య నగర్‌లో చిక్కుకున్న ఇద్దరు గర్భిణులను కాపాడారు. సుందరయ్యనగర్‌కు చెందిన నందికోళ్ల రాము(30) అనే దివ్యాంగుడు ఉప్పెనలా వచ్చిన వరదనీటిలో ముంపునకకు గురై మృతి చెందాడు.