calender_icon.png 30 September, 2024 | 6:57 AM

నేపాల్‌లో వరద బీభత్సం

30-09-2024 12:00:00 AM

148కు చేరిన మరణాల సంఖ్య

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: నేపాల్ దేశాన్ని వర్షాలు వదలడం లేదు. గత మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని ఖాట్మండు సహా 8 జిల్లాల్లో  వరద పోటెత్తడంతో పాటు కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభించింది. ఆదివారం మధ్యాహ్నానికి నేపాల్‌లో మృతుల సంఖ్య 148కు చేరింది. 68 మంది ఆచూకీ గల్లంతైంది.

ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. శనివారం నేపాల్‌లో రికార్డు స్థాయిలో 323 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద నీరు గ్రామాల్లోకి పోటెత్తడంతో దాదాపు 1244కు పైగా ఇళ్లులు నీటిమునిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 44 జిల్లాల్లో వరద ప్రభావం స్పష్టంగా కన్పించింది.

వరద కారణంగా 39 జిల్లాల్లోని ప్రధాన రహదారులను మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 3వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.