calender_icon.png 20 November, 2024 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద నష్టాన్ని పూర్తిగా అంచనా వేయాలి

10-09-2024 03:32:05 AM

  1. భారీ వర్షాలతో పంట, ఆస్తి నష్టం
  2. రాష్ట్రవ్యాప్తంగా మృతులు 33 మంది.. 
  3. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం
  4. ఇల్లు దెబ్బతిన్న ప్రతి బాధితుడికి రూ.16,500 సాయం
  5. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్,సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయని, వరదల కారణంగా భారీగా పంటలు, ఆస్తి నష్టం సంభవించిందని, ఆ నష్టాన్ని పూర్తిగా అంచనా వేయాలని  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్‌తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏయే శాఖల పరిధిలో ఎంత నష్టం జరిగింది? పునరావాసానికి ఎన్ని నిధులు కావాలి? అనే అంశా లంపై పకడ్బందీగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి పంపించాల్సిన నివేదికలో నష్టానికి సంబంధించిన అంశా లు పక్కాగా ఉండాలన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రతిపాదికన బాధితులకు సాయం అందించాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 33 మంది మృతిచెందారని స్పష్టం చేశారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రమూ అందిస్తామన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటి యజమానికి రూ.16,500 చొప్పున ఆర్థికసాయం అందిస్తామన్నారు. తొలుత ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందించాలనుకున్నామని, కానీ మానవతా దృక్పథంతో ఆలోచించి రూ.16,500కి పెంచామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురికాగా, దాదాపు 2 లక్షల మంది ప్రభావితం అయినట్లు వ్యవసాయశాఖ అధికారులు మంత్రికి వివరించారు. ముందస్తు చర్యలతో 2,454 మందిని రక్షించామన్నారు.

13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వరదల ధాటికి ఆర్‌అండ్‌బీ , పంచాయితీరాజ్ శాఖ పరిధిలో వేలాది కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని ఆయా శాఖల అధికారులు మంత్రికి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే ఆయా రోడ్ల పరిధిలో మరమ్మతులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మతులను సైతం శాశ్వత ప్రతిపాదికన చేపట్టాలని ఆదేశించారు. తాత్కాలిక మరమ్మతులతో ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రాథమిక హెల్త్ సెంటర్లు దెబ్బతిన్న వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించాలని మంత్రి ఆదేశించారు.

వర్షాల కారణంగా ఇండ్లల్లోకి వరద చేరి భూమితో పాటు ఇతర ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లు కోల్పోయిన వారు ఆందోళన చెందొద్దని సూచించారు. బాధితులు స్థానిక పోలీసు స్టేషన్లలోని ప్రత్యేక కౌంటర్లలో ఫిర్యాదు చేసి, తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. తద్వారా డుప్లికేట్ పత్రాలు పొందవచ్చని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేయాలని, ఈమేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు.

మైన్స్‌కు సంబంధించి వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో పోయడంతోనే సూర్యాపేట, పాలేరు వరద నష్టం సంభవించిందని మంత్రి స్పష్టం చేశారు. జరిగిన నష్టాన్ని ఆయా ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మైనింగ్ అధికారులకు మంత్రి సూచించారు.  రెండు ఏజెన్సీలు 18 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను పోశారని అధికారులు మంత్రికి  వివరించారు. సమావేశంలో మున్సిపల్, వ్యవసాయ, పంచాయతీరాజ్, విద్యుత్, విద్య, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.