* రూ. 12.5 కోట్ల వ్యయంతో కాల్వ పనులు చేపడుతాం
* జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్, హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్
ఎల్బీనగర్, జనవరి 22 : హస్తినాపురం డివిజన్ లోని ఏపీఎస్సీబీ కాలనీ నుండి బైరమల్ గూడా చెరువు వరకు రూ. 12.5 కోట్ల నిధులతో వర్షపు నీటి కాల్వను నిర్మించనున్నట్లు జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ , హస్తినాపురం కార్పోరేటర్ బానోతు సుజాత నాయక్ తెలిపారు. బుధవారం వివిధ శాఖల అధికారులు, వివిధ కాలనీల ప్రతినిధులతో కలిసి పనులు చేపట్టనున్న ప్రాంతాన్ని కాలినడకన వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్ష నీటి కాలువ నిర్మాణంతో హస్తినాపురం డివిజన్ కాలనీల్లో రాబోయే కాలంలో వర్షపు నీటి సమస్య ఉండదన్నారు. రెడ్డి కాలనీ నుంచి కేకే గార్డెన్ వందనపురి వెనుక భాగం వరకు వర్షం నీటి కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జోనల్ కమిషనర్ ఆదేశిం చారు.
కాల్వ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే డివిజన్ లోని చాలా ప్రాంతాల్లో వర్షం నీటి సమస్య ఉండదు అన్నారు. కేకే గార్డెన్ వెనుక భాగం నుండి వందనపురి కాలనీ వరకు ప్రైవేటు వ్యక్తుల ప్లాట్ల నుండి వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
పనులు త్వరలో ప్రారంభించి సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక కాలనీలవాసులు జోనల్ కమిషనర్, కార్పొరేటర్ ను కోరారు. ఏపీఎస్‌ఈబీ కాలనీ నుంచి బైరామన్ గూడ చెరువు వరకు నిర్మించనున్న వర్షం నీటి కాల్వ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ ఎన్ డీపీ జీహెచ్‌ఎంసీ ఇస్లావత్ నాయక్, వెంకట కిరణ్ రెడ్డి, కార్తీక్ మల్లికార్జున్ గౌడ్, ఇతర అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాలనీ తదితరులు పాల్గొన్నారు.