- దండిగా వానలు కురిసినా నిండని వైనం
- వరద మొత్తం డ్రైనేజీల్లోకే.. వీధులపైకే..
- ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇదీ దుస్థితి
ఎల్బీనగర్, సెప్టెంబర్ 8: రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల చెరువు కట్టలు తెగి పంటలను ముం చెత్తాయి. ఇండ్లలోకి సైతం వరద వచ్చింది. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాలు జలవిలయానికి విలవిలలాడా యి. కానీ, హైదరాబాద్‌లో ఎంత వర్షం కురిసినా చెరువుల్లోకి మాత్రం వరద చేరలేదు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని అనేక చెరువులు ఇప్పటికీ ఎండిపోయే దర్శనమిస్తున్నాయి.
వరుసగా కురుస్తున్న వానలకు రోడ్లు, కాలనీల్లో జలమయంగా మారాయి. చుక్క నీరు కుంటల్లోకి చేరకుండా డ్రైనేజీలు, నాలా ల ద్వారా మూసీలో కలిశాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చెరువులు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఆదేస్థితిలో ఉన్నా యి. ఇటీవల చెరువుల నాలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల లో అనేక నిర్మాణాలు వెలవడంతో వర్షపు నీరు చెరువుల్లోకి వెళ్లే దారి లేక డ్రైనేజీల్లో కలుస్తున్నాయి.
ప్రధాన చెరువులు ఇవీ..
సరూర్‌నగర్ చెరువు, బైరామల్‌గూడ చెరువు, బండ్లగూడ చెరువు, నాగోల్ చెరువు, మన్సూరాబాద్‌లోని పెద్ద, చిన్న చెరువులు, హయత్‌నగర్‌లోని బాతుల చెరువు, కుమ్మరికుంట, వనస్థలిపురంలోని బతుకమ్మ కుంట, కస్రాయ్ చెరువులతో ఇతర చెరువులు ఉన్నాయి. వీటిలో సరూర్‌నగర్ చెరువులోకి కొద్దిగా వరద చేరింది. హయత్‌నగర్‌లోని కుమ్మరికుంటలో కొంతమేర నీరుచేరింది.
మిగిలిన చెరువుల్లో చెప్పుకోదగిన తీరిలో నీరు చేరలేదు. ఫలితంగా ప్రధాన చెరువులన్నీ వెలవెలబోతున్నాయి. గతేడాది కూడా ఈ చెరువులు పూర్తిస్థాయిలో నిండకపోవడం గమనార్హం. చెరువులన్నీ పూడికతో నిండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. చెరువులన్నీ అక్రమణకు గురికావడంతో నీటి నిల్వ సామ ర్ధ్యం తగ్గింది. ఫలితంగా కొద్దిపాటి వర్షం పడినా చెరువులన్నీ నిండుతాయి. కానీ, ఈసారి వర్షాలు కురిసినా చెరువుల్లోకి నీరు చేరకపోవడంతో వెలవెలబోతున్నాయి.
లోతట్టు ప్రాంతాల్లోకి వరద..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొద్దిపాటి వర్షం పడినా కాలనీలు జలమయంగా మారతాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. కానీ, ఆ వరదంతా డ్రైనేజీల్లోకి వెళ్తుంది. సాధారణంగా ఇతర ప్రాంతాల్లోనైతే వరద నీరు చివరకు చెరువుల్లోకి చేరుతుంది. కానీ ఇక్కడా పరిస్థితి లేదు. హయత్‌నగర్‌లోని హైకోర్టు కాలనీ, మన్సూరాబాద్‌లోని సరస్వతీనగర్, ఆగమయ్యకాలనీలతోపాటు ఎన్జీవోస్ కాలనీ, వైదేహినగర్‌తోపాటు లోతట్టు ప్రాంతాల్లోని వరద డ్రైనేజీల్లో కలుస్తున్నది.
చెరువు కాల్వలకు వరదనీటిని మళ్లీస్తే చెరువులు, కుంటలు నిండుతాయి. ఇప్పటికైనా అధికారులు వరద చెరువులు, కుంటల్లోకి వెళ్లేవిధంగా పనులు పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నాయి. చెరువులకు వరదనీటిని కలిసే విధంగా కాల్వలను అనుసంధానం చేస్తే ఫలితం ఉంటుందని స్థానికులు సూచిస్తున్నారు.