ఎమ్మెల్యే, మంత్రి వర్గీయుల ఘర్షణ
కొండా వర్గీయుల అరెస్ట్
పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మంత్రి సురేఖ
హనుమకొండ, అక్టోబర్ 13 (విజయక్రాంతి): పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళీధర్‌రావు వర్గాల మధ్య వార్ నడుస్తోంది.
కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే రేవూరి, మంత్రి కొండా సురేఖ మధ్య ఫోన్‌లో జరిగిన గొడవకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం దసరా పండుగ సందర్భంగా ఇరు వర్గీయులు మరోసారి ఘర్షణకు దిగారు. గీసుగొండ మండలం ధర్మారం వద్ద వెలిసిన ఓ ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది.
ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మారంలో కొండా వర్గీయులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ఫొటో లేదని ఆయన వర్గీయులు నిరసన తెలియజేస్తూ ధ్వంసం చేశారు.
దీంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ మేరకు తనపై ఆరుగురు దాడి చేశారని ఎమ్మెల్యే రేవూరి అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గీసుగొండ పోలీసులు కొండా వర్గీయులైన నలుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ కొండా వర్గీయులు ఆందోళనకు దిగారు.
ధర్మారంలో రాస్తారోకో
పోలీసులు అరెస్ట్ చేసిన వారిని వెంటనే వదిలివేయాలని కొండా సురేఖ వర్గీయులు ఆదివారం వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై ధర్మారం వద్ద రాస్తారోకో చేశారు. మంత్రి కొండా సురేఖ ఆటోలో పలువురు కార్యకర్తలను వెంటబెట్టుకుని గీసుగొండ పోలీ స్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్ అధికారులతో మాట్లాడి అదుపులోకి తీసుకున్న వారిని వదిలేయాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తలపై చేయిచేసుకున్న అధికారులు, పోలీసులను విధుల నుంచి రిలీవ్ చేయాలని డీసీపీని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మంత్రి తో మాట్లాడి సర్ది చెప్పారు. మంత్రి వెళ్లి పోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.