- మంత్రుల పర్యటనల్లో పీసీసీ చీఫ్, డీసీసీ అధ్యక్షుడి ఫొటోలు మిస్
- వీడియో రిలీజ్ చేసి మరీ ప్రశ్నించిన డీసీసీ అధ్యక్షుడు
- నియోజకవర్గంలో రచ్చకెక్కిన వర్గపోరు
మేడ్చల్, నవంబర్ 26 : మేడ్చల్ కాంగ్రెస్‌లో ఫ్లెక్సీవార్ నడుస్తోంది. మార్కెట్ కమిటీ పాలకవర్గం, గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రు లు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్‌బాబు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి కారణమయ్యాయి.
కొన్ని ఫ్లెక్సీలలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, మరికొన్ని ఫ్లెక్సీలలో డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఫొటోలు లేవు. దీంతో ఆగ్రహించిన కొందరు కార్యకర్తలు కొన్నిఫ్లెక్సీలను చింపివేశారు. ఫ్లెక్సీల వివాదంపై డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ఒక వీడీయోను రిలీజ్ చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీ నేతలు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహించారు.
కీలక సమావేశాల్లో.. సీనియర్ నేతలతో పాటు, డీసీసీ అధ్యక్షుడి ఫొటోకూడా పెట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని.. చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏకంగా డీసీసీ అధ్యక్షుడే వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.
నియోజకవర్గంలో వర్గపోరు!
నియోజకవర్గంలో తీవ్ర వర్గపోరు నడుస్తోంది. వజ్రేష్ యాదవ్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండగా, ఇదే నియో జకవర్గానికి చెందిన హరివర్ధన్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో సుధీర్‌రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరితో పాటు నక్క ప్రభాకర్ కూడా ముఖ్యమైన నాయకుడే. ఈ నాయకుల మధ్య తీవ్ర ఆధిపత్యపోరు నడుస్తుండటంతో ఏ సమావే శం పెట్టినా అది రసాభాసకు దారితీస్తోంది.
డీసీసీ అధ్యక్షుడు వీడియో రిలీజ్ చేయడం, కార్యకర్తల హంగా మా నేపథ్యంలో మంత్రులు తమ పర్యటనను రద్దుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమం లో మంగళవారం కొందరు నాయకులు మార్కెట్ కమిటీ కార్యలయ ప్రారంభానికి హాజరైనప్పటికీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేదు.