24 May, 2026 | 8:29 PM

వెంపటి పంట పొలాల్లో అగ్ని జ్వాలలు.

24-05-2026 07:18 PM

ద్విచక్ర వాహనం దగ్ధం

 ఐకెపి కేంద్రానికి తప్పిన పెను ప్రమాదం

 పది ఎకరాల్లో మంటల తాండవం

తుంగతుర్తి,(విజయ క్రాంతి): తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామ శివారులోని స్మశాన వాటిక సమీపంలోని పంట పొలాల్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి దాదాపు పది ఎకరాల మేర విస్తరించాయి. దీంతో రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, కార్యదర్శి వీరేందర్ వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్రామస్థుల సహకారంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

మంటలను ఆర్పే ప్రయత్నాల్లో ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి మంటలు వ్యాపించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే ధాన్యం నిల్వలో వ్యవసాయ సామాగ్రి అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉండేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే అగ్ని ప్రమాదంతో పంట పొలాల్లో గడ్డి, ఎండిన అవశేషాలు కాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.సంఘటనపై స్థానిక అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.