10-04-2025 05:58:20 PM
రెండు వేల జరిమానా..
కామారెడ్డి (విజయక్రాంతి): పోక్సో కేసు(POCSO case)లో ఒకరికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రెండు వేల జరిమానాను న్యాయమూర్తి విధించినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. ఓ బాలికపై లైంగిక దాడి కేసు(పోక్సో) లో నేరస్తుడు అయిన షేక్ షాదుల్ అనే వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 6 ఏళ్ల మైనర్ బాలిక 2021 జనవరి 16న ఇంటి బయట అడుకుంటున్న చిన్నారిపై నిజాంసాగర్ మండలం, బూర్గుల్ గ్రామానికి చెందిన షేక్ షాదుల్ బాధిత బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో అమె ఏడుస్తూ తీవ్ర భయాందోళనకు గురై రోజువారి మాదిరిగానే వ్యవసాయం పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. 2021 జనవరి 17న స్ధానిక నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. పరిశోధనలో భాగంగా ఇంటి వారిని, గ్రామస్తులను, విచారించి షేక్ షాదుల్ ను నేరస్తునిగా గుర్తించి పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
ఈ విషయములో సాక్షులను విచారించి, సరియగు సాక్షాలను సేకరించి నేరస్తుడిపై కోర్టు యందు పోక్సో కేసులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులపై మోపిన నేరం రుజువు అయిందని 05 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.రెండు వేలు జరిమానా విధించారు. ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి నిజాంసాగర్ ఎస్సై హైమద్, పోలీసు తరపున వాదనలు వినిపించిన అదనపు ప్రాసిక్యూటర్ శేషు, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత ఎస్సై శివకుమార్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ టి. మురళి, కోర్ట్ కానిస్టేబుల్ కిషన్ లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.