బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 24న కాగజ్ నగర్ కు చెందిన కార్ డ్రైవర్ పాముల పురుషోత్తం(Car Driver Pamula Purushotham)పై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలొద్దిన్(CI Syed Afzaluddin) తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ లో విలేకరులకు వెల్లడించారు. పాత పగలన మనస్సులో ఉంచుకొని నిందితులు డ్రైవర్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పాత నర్సాల గ్రామానికి చెందిన పాముల శివ సాయి, జాడి శ్యామ్ రావు, బట్టుపల్లి గ్రామానికి చెందిన పెంటపర్తి రమేష్, బల్లార్షా కు చెందిన సముద్రాల మహేష్ సురేష్, చంద్రపూర్ లోని బల్లార్పూర్ కు చెందిన ప్రదీప్ రుషికేషన్ లు ఈనెల 24న కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద బాధితుడు పురుషోత్తం కు చెందిన ఏపీ 26 ఏ క్యూ 2929 నెంబర్ గల కారును మంచిర్యాలకు వెళ్లేందుకు రూ 2700 కు కిరాయికి కుదుర్చుకున్నారు.
వీరిలో ఒక వ్యక్తి బెల్లంపల్లి శ్రీనిధి హోమ్స్ దగ్గర దిగుతానని చెప్పారు. బెల్లంపల్లి లోని పంచముఖి హనుమాన్ విగ్రహం దగ్గర యూటర్న్ తీసుకుని కొంత దూరం వెళ్ళాక తిరుమల హిల్స్ దాటాక మూత్ర విసర్జన కోసం కారును ఆపమన్నారు. కారు డ్రైవర్ పురుషోత్తం కిందికి దిగగానే ముగ్గురు వ్యక్తులు బండ రాయితో అతని తలా కాలపై మోది, చనిపోయాడనుకొని అతని వద్దనున్న సెల్ ఫోన్,రూ 3500 నగదు తీసుకొని కారుతో సహా కాగజ్ నగర్ వైపు వెళ్లిపోయారు. బాధితుడు పురుషోత్తం కుమారుడు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.పోలీసులకు అదే రోజు వచ్చిన పక్కా సమాచారం మేరకు తాండూర్ మండలం మాదారం 3 ఇంక్లైన్ ప్రాంతంలోని అడవిలో నిందితులను పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. నిందితుల దగ్గర నుండి కారుతోపాటు రూ 5 వేల నగదు తో పాటు 6 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. సమావేశంలో తాళ్ల గురజాల ఎస్సై సిహెచ్ రమేష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.