calender_icon.png 21 November, 2024 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో ఐదంతస్తుల బిల్డింగ్ నేలమట్టం

21-11-2024 01:01:17 AM

  1. పక్కకు ఒరగడంతో కూల్చేసిన హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు
  2. 60 గజాల స్థలంలోనే ఐదంతస్తుల నిర్మాణం
  3. జీహెచ్‌ఎంసీ అధికారుల అవినీతికి సాక్ష్యం

శేరిలింగంపల్లి, నవంబర్ 20 (విజయక్రాంతి): మాదాపూర్ సిద్ధిఖ్‌నగర్‌లోని 5 అంతస్తుల భవనం ఓ వైపునకు ఒరగడంతో హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు బుధవారం నేలమట్టం చేశారు. పక్క స్థలంలో బిల్డింగ్ కట్టేందుకు గుంతలు తీయడంతో మంగళవారం రాత్రి ఈ బిల్డింగ్ గుంతలు తీస్తున్న వైపు ఒరిగింది.

దీంతో బిల్డింగ్‌లో నివసించే దాదాపు 50 మంది ఒక్కసారిగా ప్రాణభయంతో పరుగులు తీశారు. విషయం పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలియడంతో రాత్రి గం.9.30 లకు బిల్డింగ్‌లో ఉన్నవాళ్లందర్నీ కట్టుబట్టలతో ఖాళీ చేయించారు. శేరిలింగంపల్లి సర్కిల్ సిద్ధిఖ్‌నగర్‌లో లక్ష్మణ్, స్వప్న దంపతులు 50 గజాలలో జీ ప్లస్ 4 అంతస్తులతో పాటు ఐదో ఫ్లోర్‌లో పెంట్ హౌస్ నిర్మించుకున్నారు.

గ్రౌండ్ ఫ్లోర్, పెంట్ హౌస్‌లో సింగిల్ రూమ్ చొప్పున నిర్మించగా, మిగతా నాలుగు అంతస్తుల్లో రెండు గదుల చొప్పున నిర్మించారు. ఈ భవనం సమీపంలోని పలు కంపెనీలలో చిరుద్యోగులుగా పనిచేసే మణిపూర్, అస్సాం ప్రాంతాలకు చెందిన 50 మంది నివసిస్తున్నారు.

అయితే, ఆ పక్కనే ఉన్న 150 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి పునాదులు తవ్వడానికి పిల్లర్ పుట్టింగ్ చేయడానికి పెద్ద గుంత తవ్వారు. ఐదంతస్తుల భవనం సుమారు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గుంతలు తీసిన స్థలం వైపు ఒరిగింది.  

గ్యాస్ సిలిండర్లు, బట్టలు వదిలి..

అయితే.. ఏ సమయంలో ఏం జరుగుతుందోనంటూ అప్రమత్తమైన పోలీసులు రాత్రంతా హైడ్రా డీఆర్‌ఎఫ్, ట్రాఫిక్, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి పరిస్థితులను రాత్రంతా పర్యవేక్షించారు.

బుధవారం ఉదయం హైడ్రాలిక్ యంత్రం తో కూల్చివేతలు ప్రారంభించారు. యంత్రానికి సాంకేతిక లోపంతో కొద్దిసేపు కూల్చి వేతలు నిలిపి అనంతరం కొనసాగించారు. ఈ సందర్భంగా బాధితులు ఇంట్లో గ్యాస్, బట్టలతో సహా వదిలేసి కట్టు బట్టలతో ఖాళీ చేయాల్సి వచ్చింది. 

ఊర్లో పొలం అమ్మి ఇల్లు కట్టుకున్నాం

మా ఇంటి సమీపంలో ఇల్లు నిర్మిస్తున వ్యక్తి మాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పనులు చేపట్టాడు. గుంతలు తవ్వుతున్న క్రమంలో మా పిల్లర్స్, డ్యామేజ్ అయ్యాయి. మాకు ఊర్లో ఉన్న రెండెకరాల పొలం అమ్మి మాదాపూర్‌లో ఇల్లు కట్టుకున్నాం. ఒరిగిన కారణంగా అధికారులు మా భవనాన్ని కూల్చివేయడానికి మేం ఒప్పుకున్నాం. కానీ మా భవనం ఒరిగిపోడానికి కారణమైన పక్క నిర్మాణదారుడి నుంచి మాకు నష్టపరిహారం ఇప్పించాలి.           

బాధితురాలు స్వప్న