calender_icon.png 24 October, 2024 | 4:01 AM

ఇల్లందు జేకే-5 ఓసీ గనికి ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డు

24-10-2024 01:19:34 AM

కొత్తగూడెం, అక్టోబర్ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  సింగరేణి ఇల్లెందు ఏరియాలో త్వరలో కాలపరిమితి ముగియనున్న ఇల్లెందు జేకే (జవహర్ ఖని) -5 ఉపరితలగని మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఫైవ్‌స్టార్ రేటింగ్ అవార్డు సాధించిన ఘనతను దక్కించుకుంది.

కోల్‌ఇండియా, సింగరేణి, ప్రభుత్వ, ప్రవేటు భూగర్భ, ఉపరితల గనులకు సంబంధించి దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 380 గనుల్లో వివిధ అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ అవార్డును బొగ్గు గనుల మంత్రిత్వశాఖ అందజేస్తుంది. తెలంగాణ నుంచి ఇల్లెందు జేకే-5 ఉపరితలగనితో పాటు రామగుండం ఆర్జీఓసీ-1కి ఈ అవార్డును కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రి సతీశ్ చంద్రదూబే చేతుల మీదుగా అధికారులు  తీసుకున్నారు.

ఇదేచోట జల విద్యుత్‌కు ప్రణాళికలు

హైడ్రో పవర్ కోసం వివిధ దేశాలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ సైతం ఆ దిశగా దృష్టి సారించింది. కాలపరిమితి ముగిశాక జేకే-5 ఉపరితలగనిలో జలవిద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. రెండు నెలల క్రితం ఇక్కడి గని పరిసరాల్లో 20 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలను సింగరేణి ఎండీ ఎన్.బలరాం, అధికారులు పరిశీలించారు.  

12 ఏళ్ల ప్రస్థానంలో..

జేకే-5 ఉపరితలగని 2012లో ప్రారంభమైంది. ఏటా నిర్దేశించిన లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సాధిస్తూ ఇల్లందు ఏరియాలో ప్రత్యేకంగా నిలిచింది. 2021-22లో 20 లక్షల టన్నులు, 2022-23లో 14.50 లక్షల టన్నుల లక్ష్యానికి 18.79 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది.

2023-24లో 8.71 లక్షల టన్నులు, ఈ ఆర్థిక సంవత్సరంలో 6 లక్షల టన్నుల లక్ష్యానికి గాను ఇప్పటికే 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ఉపరితలగని కాలపరిమితి ముగియనుంది. ఈ తరుణంలో గని విస్తరణకు అనుమతులు రావడంతో మరో ఏడేళ్ల పాటు ఇల్లెందులో బొగ్గు ఉత్పత్తి సాగనుంది.