పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు రోడ్డుపై గురువారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... భద్రాచలం ముక్కోటి విధులు నిర్వహించుకుని తిరిగి కొత్తగూడెం వైపు వస్తున్న ఎస్ఐ రామారావు కారు వేగంగా వస్తూ జగన్నాధపురం వద్ద ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముక్కోటి విధులు నిర్వహించుకుని అటుగా వెళ్తున్న కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ స్పందించి తన వాహనంలో క్షతగాత్రులను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అతివేగంతో ఢీ కొట్టిన కారు ఎస్ఐ రామారావు వాహనంగా గుర్తించారు. అతనే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఎస్ఐ రామారావు కొత్తగూడెం పోలీస్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. క్షతగాత్రులు పాల్వంచలో చికిత్స పొందుతున్నారు. పాల్వంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.