08-04-2025 11:05:54 AM
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు
పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరిశిక్ష
ఏన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కీలక తీర్పు ఇచ్చింది. బాంబు పేలుళ్ల కేసులో దోషుల పిటిషన్ ను హైకోర్టు మంగళవారం నాడు డిస్మిస్ చేసింది. ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరాలు చేసింది. ఎన్ఐఏ కోర్టు(NIA Court) ఐదుగురు నిందితులకు 2016లో ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును రద్దు చేయాలని ఐదుగురు నిందితులు హైకోర్టులో అప్పీల్ వేశారు. నేడు విచారణ చేపట్టిన హైకోర్టు దోషుల అప్పీల్లను తిరస్కరించి ఏన్ఐఏ (NIA Special Court) ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది.
2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్( Dilsukhnagar bomb blast case)లో జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. 2013లో బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మందికి గాయాలయ్యాయి. మొదటి పేలుడు మలక్ పేట్ పోలీస్ పరిధిలోని బస్ స్టాప్ సమీపంలో జరిగింది. ఆ తర్వాత కొన్ని సెకన్ల తర్వాత సైబరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని A-1 మిర్చి సెంటర్ షాపు సమీపంలో రెండవ పేలుడు సంభవించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. మిగిలిన ఐదుగురు నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. అనంతరం ఉరిశిక్ష ధ్రువీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పు హైకోర్టుకు నివేదించింది. కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని ఐదుగురు నిందితులు అప్పీల్ వేశారు. అప్పీళ్లపై 45 రోజుల సుదీర్ఘ విచారణ జరిగిన హైకోర్టు తీర్పు వాయిదా వేసిన విషయం తెలిసిందే.