calender_icon.png 16 January, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనందమైన జీవితానికి ఐదు సూత్రాలు

28-10-2024 12:00:00 AM

ఆనందంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అయితే నేటి జీవన విధానం, బిజీ లైఫ్ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హ్యాపీ లైఫ్ కోసం కొద్దిసేపు నడక, వ్యాయాయం చేస్తూ దాంతోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మానసికంగా సంతోషంగా ఉంటామో అప్పుడే నిజమైన ఆనందం కలుగుతుందంటున్నారు నిపుణులు. ఈ ఐదు సూత్రాలతో ఆనందంగా ఉండొచ్చు. అవేంటో తెలుసా..

1 సమతుల ఆహారం

పౌష్టికాహారం ఏ వయసువారికైనా మంచిది. సీనియర్ సిటిజన్లు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి డైట్ ఫాలో అవ్వాలి. ఉదాహరణకు.. రక్తపోటు ఉన్నవారు ఉప్పు తీసుకోవడం పరిమితం చేయాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఒక ముఖ్యమైన భాగం. ఆహారం మాదిరిగానే శరీరంలో శక్తి స్థాయిల పెంపుకోసం తగినంత నీరు తీసుకోవడం కూడా అవసరం.

2 మంచి నిద్ర 

వయసు పెరిగే కొద్దీ నిద్ర విధానాలు మారిపోతాయి. నిద్రలేమి, స్లీప్ అప్నియా పెద్దోళ్లకు ప్రధాన సమస్యలు. మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. 65 ఏళ్లు పైబడిన పెద్దలు రోజుకు కనీసం  ఎనిమిది గంటల నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలి. నిద్ర షెడ్యూల్స్‌ను నిర్ణయించడం, త్వరగా పడుకోవడం, లోతైన శ్వాస లాంటి చిట్కాలు పాటించడం ద్వారా నిద్ర అలవాట్లను మెరుగుపరచవచ్చు.

3 కొత్త విషయాలు

బిజీ -లైఫ్ కారణంగా ఒకప్పుడు తమ అభిరుచులను కొనసాగించలేనివారు ఎంతోమంది ఉంటారు. రిటైర్మెంట్ తర్వాత సంతోషం, మనశ్శాంతినిచ్చే కార్యకలాపాల్లో నిమగ్నం కావడం చాలా ముఖ్యం. క్రాస్ వర్డ్ పజిల్స్ పరిష్కరించడం, చదవడం, రాయడం లాంటివి జ్ఞాపకశక్తిని బాగా పెంచుతాయి. కొత్త విషయాలు, కొత్త అలవాట్లు ఎప్పుడు సంతోషాన్నిస్తాయి. అలాగే ఒత్తిడి స్థాయి తగ్గించడం, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం కూడా అవసరం. 

4 శారీరకంగా చురుకుగా..

అలసట, బద్ధకం వృద్ధాప్యం సంకేతాలు. అయి తే శారీరక శ్రమ లేకపోవడం ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని గ్రహించాలి. కొద్దిపాటి శ్రమ ఎ ముకల బలం, శారీరక ఓర్పును తగ్గిస్తుంది. అలాగే హృదయ సంబంధ వ్యాధులు, గుండెపోటు ప్ర మాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు, నడక, తోటపని లాంటి అలవాట్లు శరీరా నికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. యోగా సాధన ఆరోగ్యాన్ని  బాగా మెరుగుపరుస్తుంది.

5 ఆశావాదం 

జీవితంలో ప్రతి సందర్భంలో సంతోషంగా ఉండటం ముఖ్యం. వీలైనంతవరకు ఆశావాదంగా ఉండాలి. ఎవరైతే స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ దిశగా అడుగులు వేస్తారో వాళ్లంతా చాలా సంతోషంగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

అందువల్ల శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోకుండా భవిష్యత్తులో ఏలా ఉండాలి? అనే దానిపై కచ్చితమైన ప్రణాళిక వేసుకోవాలి. సకాలంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం, బంధాలను కలుపుకోవడం, నవ్వుతూ ఉండటం లాంటివన్నీ సంతోషాన్నిస్తాయి.