calender_icon.png 4 October, 2024 | 8:58 PM

ఒక్క రోజులో 5.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

07-09-2024 12:00:00 AM

  1. యూఎస్ ఎకానమీ భయాలతో మార్కెట్ పతనం
  2. సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు డౌన్ 
  3. ఐటీ, ఆయిల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లకు భారీ నష్టాలు

ముంబై, సెప్టెంబర్ 6: యూఎస్ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులకు సంకేతంగా వెలువడే జాబ్స్ రిపోర్ట్ వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు పతనమయ్యాయి. ఇదేబాటలో భారత సూచీలు సైతం శుక్రవారం భారీ క్షణతను చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,000 పాయింట్లకుపైగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 300 పాయింట్ల వరకూ పడిపోయాయి. ఈ ఒక్కరోజులోనే రూ.5.50 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.5,49,925 కోట్ల మేర తగ్గి రూ.4,60,18,976 కోట్ల (5.48 ట్రిలియన్ డాలర్లు) వద్ద నిలిచింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన సెన్సెక్స్  ఇంట్రాడేలో 1,219 పాయింట్లు పతనమై 80,981 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది.

తుదకు 1,017 పాయింటు కోల్పోయి 81,184 పాయింట్ల వద్ద నిలిచింది.  రెండు వారాల తర్వాత సెన్సెక్స్‌కు ఇదే కనిష్ఠస్థాయి. ఇదేబాటలో  నిఫ్టీ ఇంట్రాడేలో కీలకమైన 25,000 పాయింట్ల స్థాయిని కోల్పోయి 350 పాయింట్ల మేర తగ్గి 24,801 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 293 పాయింట్ల క్షీణతతో 25,145 పాయింట్ల కొత్త వద్ద ముగిసింది. నిఫ్టీ క్షీణించడం వరుసగా ఇది మూడో రోజు.ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయని ట్రేడర్లు తెలిపారు.  ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,181 పాయింట్లు, నిఫ్టీ 384 పాయింట్ల చొప్పున తగ్గాయి.  ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌లు రెడ్‌లో ముగిసాయి. యూరప్‌లో ప్రధాన మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు సైతం తగ్గాయి. 

క్షీణతకు కారణాలివి..

మార్కెట్ పెరిగేందుకు అవసరమైన ట్రిగ్గర్స్ లేకపోవడం, షేర్ల విలువలు అధికస్థాయిలో ఉండటం, దీనికి తోడు యూఎస్ జాబ్స్ డేటా వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల జాగ్రత్త తాజా మార్కెట్ పతనానికి కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇటీవల యూఎస్ మార్కెట్లు మూమెంటం కోల్పోవడం భారత సూచీలను ప్రభావితం చేసిందని, అలాగే అమెరికా జాబ్స్ డేటా వెలువడే ముందు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ప్రపంచ మార్కెట్లు దాదాపు మూడు వారాల కనిష్ఠస్థాయిలో ట్రేడవుతున్నాయని, క్రూడాయిల్ ఈ ఏడాది కనిష్ఠానికి తగ్గిందని, అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గుదల వేగాన్ని, తగ్గుదల పరిమాణాన్ని శుక్రవారం వెలువడే జాబ్స్ డేటా నిర్దేశిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. 

ఎస్బీఐ టాప్ లూజర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఎస్బీఐ షేరు  4  శాతం పైగా క్షీణించింది.  ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీలు 2 శాతం వరకూ తగ్గాయి. బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతిలు స్వల్పంగా పెరిగాయి. అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ముగిసాయి. అన్నింటికంటే అధికంగా టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 3.23  శాతం తగ్గింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.19 శాతం, బ్యాంకెక్స్ 1.93 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.70 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.58 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1,41 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.96 శాతం చొప్పున క్షీణించాయి.బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,541 స్టాక్స్ క్షీణించగా, 1,406 షేర్లు పెరిగాయి.

జాబ్స్ డాటాతో రేట్ల కోతపై సందేహాలు

రెండు, మూడు రోజులుగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనను శుక్రవారం రాత్రి వెలువడిన యూఎస్ జాబ్స్ డాటా మరింత పెంచింది.   ఆగస్టు నెలలో యూఎస్‌లో 1,42,000 ఉద్యోగాలు జత అయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 1,60,000 జాబ్స్ యాడ్ కావచ్చన్న విశ్లేషకుల అంచనాలకంటే తక్కువగానే జతయ్యాయి. అయితే జూలైలో 89,000 ఉద్యోగాల కల్పన జరగ్గా, అంతకంటే అధికంగా ఆగస్టులో వచ్చాయి. నిరుద్యోగం రేటు 4.3 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గింది.  కానీ జూలైకంటే గణనీయంగా పెరగడం, నిరుద్యోగం రేటు తగ్గడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉన్నదన్న సంకేతాలు వెల్లడికావడంతో ఈ సెప్టెంబర్ 18 నాటి సమీక్షలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను అరశాతం తగ్గించబోదని, పావుశాతం కోతతో సరిపెడుతుందన్న ఆందోళన ఇన్వెస్టర్లలో మొదలయ్యింది. దీంతో యూఎస్ స్టాక్ సూచీలు క్షీణబాట పట్టాయి. భారత్ మార్కెట్ ముగిసిన తర్వాత ఈ డేటా వెలువడింది.