- బీమా ప్రీమియంపై పన్ను కోత ప్రతిపాదన వాయిదా
- 148 ఐటెమ్స్ పన్ను మార్పుల ప్రతిపాదనలూ జనవరికి వాయిదా
- పాప్‌కార్న్‌పై పన్ను.. వివిధ రకాలపై వేర్వేరుగా జీఎస్టీ
- జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు
- జైసల్మేర్, డిసెంబర్ 21: అందరూ ఆసక్తిగా వేచిచూస్తున్న పలు ప్రధాన అంశాలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండానే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్న 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం జీవిత, సాధారణ బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను తగ్గించాలన్న మంత్రుల గ్రూప్ సిఫార్సులపై ఎటూ తేల్చలేదు.
ప్రీమియం వాచీలు, పాదరక్షలు, రెడీమేడ్ దుస్తులపై పన్ను పెంపు తదితర 148 ఐటెమ్స్‌పై పన్ను రేట్ల మార్పులను ప్రతిపాదనలు, సిగరెట్లు, కార్పొనేటెడ్ శీతల పానీయాల కోసం ప్రత్యేకంగా 35 శాతం జీఎస్టీ పన్ను శ్లాబ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై నిర్ణయాల్ని జనవరిలో జరిగే సమావేశంలో తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 148 ఐటెమ్స్‌పై పన్ను మార్పు ప్రతిపాదలనపై మంత్రుల గ్రూప్ సిఫార్సులను ఇప్పటివరకూ సమర్పించలేదని, జనవరిలో సమర్పిస్తుందని మంత్రి తెలిపారు.
అలాగే స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌పై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో కలిసి) 5 శాతానికి (ఐటీసీ లేకుండా) తగ్గించాలన్న ప్రతిపాదనపై కూడా కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు. విమానయాన ఇంధనం ఏటీఎఫ్‌ను వస్తు సేవల పన్ను పరిధిలోకి తీసుకురాకూడదని కౌన్సిల్ నిర్ణయించింది.
ప్రధాన నిర్ణయాలు
* కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు)పై జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేయాలని, కంపెనీలు కొనుగోలు చేసే యూజ్డ్ ఈవీలపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని కౌన్సిల్ నిర్ణయించింది. వ్యక్తులు కొనే, అమ్మే యూజ్డ్ ఈవీలకు ఈ పెంపు వర్తించదు.
* రుణాలు డిఫాల్ట్ అయినందుకు బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు విధించే అపరాధ రుసుంపై జీఎస్టీ ఎత్తివేత
* ప్రజా పంపిణీకి వినియోగించే ఫోర్టిఫైడ్ రైస్‌పై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
* జీన్ థెరపీ జీఎస్టీ నుంచి మినహాయింపు
* ప్రిప్యాకేజ్డ్, లేబుల్డ్ ఐటెమ్స్‌పై నిర్వచనాన్ని సవరించాలంటూ కౌన్సిల్ సిఫార్సు
* ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను తగ్గించాలన్న నిర్ణయం వాయిదా. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ అభిప్రాయాలను కోరిన కౌన్సిల్
* లాంగ్ రేంజ్ సర్ఫేస్ నుంచి ఎయిర్ మిసైల్ సిస్టమ్‌కు పన్ను మినహాయింపు
పాప్‌కార్న్‌పై పన్ను ఇలా
ప్యాక్‌చేయని, లేబుల్ చేయని పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎస్టీ, ప్యాక్‌చేసిన స్పైస్డ్ పాపకార్న్‌పై 12 శాతం జీఎస్టీ ఉంటుంది. క్యారమెల్ పాప్‌కార్న్‌పై 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. పాప్‌కార్న్‌పై జీఎస్టీని వివరిస్తూ సర్క్యులర్ జారీచేయాలని కౌన్సిల్ నిర్ణయించింది.