26-02-2025 11:41:01 PM
తూర్పు గోదావరి తాడిపూడి మండలంలో ఘటన..
మహా శివరాత్రి పర్వదినాన విషాదం..
తాళ్లపూడి: తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన వారిలో ఐదుగురు గల్లంతయ్యారు. శివరాత్రి పురస్కరించుకొని బుధవారం తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నది లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించడంలో విఫలం కావడంతో ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే క్రమంలో వారంతా గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గత ఈతగాళ్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు పవన్ (17), దుర్గాప్రసాద్ (19), సాయి కృష్ణ (19), పవన్ (19), ఆకాశ్ (19)గా గుర్తించారు. వీరంతా కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు. యువకులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో విషాదచాయలు అలుముకున్నాయి.