calender_icon.png 12 January, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్యాంలో దిగి.. ఫొటోలు దిగుతూ.. ఐదుగురు మృతి

12-01-2025 01:19:09 AM

ఆలయ సందర్శనకు వెళ్లి అనంతలోకాలకు.. 

  1. కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో దుర్ఘటన 
  2. తోటి మిత్రులు కాపాడేందుకు యత్నించినా ఫలితం లేదు 
  3. మృతులంతా హైదరాబాద్‌వాసులే.. వారిలో ఇద్దరు అన్నదమ్ములు 
  4. యువకుల మరణంతో పెనువిషాదం

గజ్వేల్/ముషీరాబాద్, జనవరి 11: సంక్రాంతి పండగ వేళ ఐదు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. సెలవుల్లో స్నేహితులతో కలిసి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి జాతర, కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌కు వెళ్లి ఆనందంగా గడుపుతామనుకున్న వారికి ఇదే చివరి యాత్రగా మిగిలింది.

కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో సరదాగా ఫొటోలు తీసుకుంటుండగా ఐదుగురు స్నేహితులు నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ ఇందిరానగర్ ఫస్ట్ వెంచర్‌కు చెందిన ధనుష్ (20), లోహిత్ (17), బన్సీలాల్‌పేటకు చెందిన చీకట్ల దినేశ్వర్ (17), అత్తాపూర్‌కు చెందిన సుతార్  సాహిల్ (19), ఖైరతాబాద్ చింతల్ బస్తీకి చెందిన జతిన్(17) స్నేహితులు.

ఇందులో ధనుష్, లోహిత్ అన్నదమ్ములు. సెలవులను ఆనందంగా గడపడానికి వీరు మరో ఇద్దరు స్నేహితులు మురుగన్, ఎండీ ఇబ్రహీంతో కలిసి శనివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని  మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌కు వెళ్లారు. అందరూ జలాశయంలోకి కేరింతలు కొడు తూ సరదాగా ఫొటోలు దిగారు.

ధనుష్, లోహిత్, దినేశ్వర్, సుతార్  సాహిల్, జతిన్ నీళ్లలో ఉండగా వారిని ఫొటోలు తీసేందుకు మురుగన్, ఎండీ ఇబ్రహీం ఒడ్డున ఉన్నారు. నీళ్లలో వారు సరదాగా ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత ఒకరు నీటిలో కొట్టుకపోయారు. అది గమనించిన మురుగన్, ఇబ్రహీం తమ స్నేహి తులను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

ప్రమాద విషయం తెలుసుకున్న సిద్దిపేట పోలీసు కమిషనర్ డాక్టర్ అనురాధ పోలీసు సిబ్బందితో కలిసి గజ ఈతగాళ్ల సాయంతో  మృతదేహాలను వెలికితీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ బిడ్డలు డ్యామ్‌లో పడి చనిపోయిన వార్త విని మృతుల కుటుంబా లు అక్కడికి చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఇద్దరు కుమారుల మృతితో..

సికింద్రాబాద్ బాకారానికి చెందిన జయ శ్రీ  రావు కుటుంబం  రెండు నెలల కింద భోలక్‌పూర్‌లోని ఇందిరానగర్ ఫస్ట్‌వెంచర్‌లో తమ అత్తగారింటిపై ఇంటిని నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు. వీరికి ధనుష్, లోహిత్ సంతానం. ధనుష్ టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈఈఈ బ్రాంచ్ ఫైనలియర్ చదువుతున్నాడు.

లోహిత్ ఫొటోగ్రాఫర్ వద్ద పని చేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే ధనుష్, లోహిత్ మృతి చెందడంతో బంధువులు, కాలనీవాసులు నర్సింగ్‌రావు ఇంటికి భారీగా తర లివచ్చి కంటతడిపెట్టడం అందరినీ కదిలించింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ పార్టీల నాయకులు సైతం వచ్చి బంధువులను ఓదార్చారు.

తండ్రికి చొక్కా కొనిచ్చి..

సికింద్రాబాద్‌లోని కవాడిగూడకు చెంది న చీకట్ల దినేశ్వర్ తండ్రి కిషన్ దాస్‌ది శనివారం పుట్టినరోజు.  తన తండ్రి బర్త్‌డే పుర ష్కరించుకుని దినేశ్వర్ శుక్రవారం చొక్కా కొ ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఉదయం ఇంట్లో ఉన్న తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పా డు.  కుమారుడు గిఫ్ట్‌గా ఇచ్చిన చొక్కా వేసుకున్న కొద్దిసేపటికే కొడుకి మరణ వార్త వినా ల్సి వచ్చిందని కిషన్‌దాస్  విలపించాడు. 

రూ.15లక్షల పరిహారమివ్వాలి..

మంచి భవిష్యత్ ఉన్న ఐదుగురు విద్యార్థులు  కొండపోచమ్మ డ్యామ్‌లో మునిగి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటి స్తూ వారికి అండగా ఉంటామని వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.15లక్షల పరిహరం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

నాయకుల పరామర్శ..

ఐదుగురు విద్యార్థుల మృతి విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మా జీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, ఎలక్షన్ రెడ్డి, పార్టీ నాయకులు డ్యాం వద్దకు చెరుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చా రు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కుటుంబాలను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. అలాగే భోలక్‌పూర్ లోని ఇందిరానగర్ ఫస్ట్ వెంచర్‌లో ధనూష్, లోహిత్ కుటుంబాన్ని  బీఆర్‌ఎస్ నాయకుడు ముఠా జైసింహ, యూత్ కాంగ్రెస్ ముషీరాబాద్ నియోజక వర్గం సీనియర్ నాయకుడు సంఘపాక వెంకట్ పరామర్శించారు.

కుటుంబాలకు తీరని లోటు

ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాం తి): కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడం దిగ్భ్రాంతికరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పినట్టు ఆయన చెప్పారు.

చేతికి అందొచ్చిన పిల్ల లు.. ఇలా అకాల మరణం చెందడం ఆ కుటుంబాలకు తీరని లోటన్నారు. విష యం తెలియగానే సిద్దిపేట పోలీస్ కమిషనర్, ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడి నట్టు వెల్లడించారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ రకమైన ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.

యువకుల మృతి బాధాకరం: బండి సంజయ్

ఐదుగురు యువకుల అకాల మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశా రు. సెల్ఫీల కోసం తొందరపాటు చర్యలకు పాల్పడి ప్రాణాలు కోల్పోవద్దని, ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చవద్దని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. 

సహాయక చర్యలు చేపట్టండి: మంత్రి పొన్నం 

కొండపోచమ్మ సాగర్‌లో పడి యువకులు మృతిచెందిన విషయం తెలుసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఘటనపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో మాట్లాడారు. అధి కారులు వేగంగా సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు.

ప్రాజెక్టుల వద్దకు ఈతకు వెళ్లకుం డా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. యువకుల మృతిపై స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. కలెక్టర్ మను చౌదరికు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మ రం చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ప్రభుత్వం అండగా నిలవాలి: కేటీఆర్ 

యుక్తవయస్సులో యువకు లు అకాల మర ణం చెందడం వారి కుటుంబాలకు తీరనిలోటని కేటీఆర్ అన్నారు. తీవ్ర విషాదంలో ఉన్న ఆయా కుటుంబాలకు ప్రభు త్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. యువకులు కుటుంబాలకు తన ప్రగాఢ సానభూతిని తెలియజేశారు.