calender_icon.png 29 November, 2024 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రానికి ఐదు కొత్త పాలసీలు!

29-11-2024 03:21:43 AM

  1. ముసాయిదాలను  సిద్ధం చేసిన యంత్రాంగం
  2. ప్రజాపాలన విజయోత్సవాలు లేదా అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించే అవకాశం
  3. శరవేగంగా స్పోర్ట్స్ పాలసీకి రూపకల్పన 
  4. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో తీసుకొస్తున్న ప్రభుత్వం
  5. టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం,  సాంస్కృతిక విధానాలూ రెడీ 

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో పాలసీలను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు సందర్భాల్లో ప్రభుత్వం కొన్ని పాలసీలను ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ పాలసీల్లో టూరిజం, క్రీడా, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, సాంస్కృతిక విధానాలు ముందువరుసలో ఉన్నాయి.

విధానాలపై ఆయా విభాగాల అధికారులు పలుమార్లు అంతర్గత సమావేశాలు నిర్వహించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఐదు పాలసీలకు సంబంధించిన ముసాయిదాను ఆ శాఖ అధికారులు సిద్ధం చేశారు. వాటిని ప్రకటించడమే మిగిలి ఉంది. రాష్ట్రం ఏ రంగంలో అయినా అభివృద్ధి సాధించాలంటే దానికి ఒక పాలసీ ఉండాలి. ఆ పాలసీని చూసి పెట్టుబడి పెట్టడానికి సంస్థలు ముందుకొస్తాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి చాలా రంగాల్లో ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాలసీలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే పలు విధానాలను తీసుకొస్తున్నట్టు ప్రటించింది. ఇప్పటికే ఎంఎస్‌ఎంఈ విధానాన్ని వెల్లడించిన సర్కారు.. ఒక్కొక్క పాలసీ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

మూడు టూరిజం సర్క్యూట్లు

ఇదే సమయంలో మూడు దేవాలయాల టూరిజం సర్క్యూట్లను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ౩ సర్క్యూట్లలో యాదాద్రి, వేములవాడ, బాసర ఉన్నట్టు సమాచారం. ఈ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే వేములవాడకు రూ.127 కోట్లను మంజూరుచేసింది. బాసర, యాదగిరిగుట్ట అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టింది. టీటీడీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత.. యాదగిరిగుట్టలో అభివృద్ధి పనులు మరింత ఊపందకుంటుందని భావిస్తుంది. ఈ క్రమంలో భక్తులను ఆకర్షించేలా ఆ మూడు ఆలయాలను టూరిజం సర్క్యూట్లుగా అభివృద్ధి చేసేందుకు సమాయత్తమవుతోంది.

శరవేగంగా స్పోర్ట్స్ పాలసీ 

క్రీడల్లో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే లక్ష్యంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని సర్కారు తీసుకొస్తోంది. నవంబర్ చివరి నాటికి ముసాయిదాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో యంత్రాంగం ఇప్పటికే ముసాయిదాను సిద్ధం చేసినట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డికి క్రీడలంటే చాలా ఇష్టం.

అందుకే విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దాన్ని పీపీపీ మోడ్‌లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పర్యాటక, మెడికల్ టూరిజం, ఎకో టూరిజం, సాంస్కృతిక పాలసీలు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. వాటిని ప్రకటించే మంచి సందర్భం కోసం ప్రభుత్వం ఇన్నాళ్లు వేచిచూసింది. ఇదే సమయంలో విజయోత్సవాలు వచ్చాయి. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఈ రెండు సందర్భంగా ఎప్పుడు ప్రకటించాలనే సందిగ్ధంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.