calender_icon.png 4 March, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5 నిమిషాలు గ్రేస్ పీరియడ్

04-03-2025 02:02:20 AM

  1. వాచ్‌లు పెట్టుకొని వస్తే అనుమతి నిరాకరణ
  2. ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడి
  3. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. 
  4. హాజరుకానున్న 9,96,971 మంది విద్యార్థులు

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యమొచ్చినా లోనికి అనుమతించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ వార్షిక పరీక్షలకు ఉదయం 8.45 గంటలలోపు వస్తేనే అనుమతిస్తామన్న నిబంధనను ఇంటర్ బోర్డు పెట్టినా 9.05 గంటల వరకు వచ్చిన విద్యార్థుల ను సైతం పరీక్షకు అనుమతించనున్నట్టు ఆయన వెల్లడించారు.

ఉదయం 8.45 గంటల వరకు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని హాల్‌టికెట్లపై ముద్రించిన మాట వాస్తవమేనని, విద్యార్థులు త్వరగా పరీక్షాకేంద్రాలకు చేరుకొని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలనే ఉద్ధేశంతోనే అలా ముద్రించామన్నారు.

మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్ష ల నేపథ్యంలో సోమవారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో కృష్ణ ఆదిత్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ఓ విద్యార్థి ఆలస్యంగా పరీక్షకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సడలింపునిచ్చామన్నారు.

ఈ నెల 25 వరకు జరిగే ఇంటర్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఆలస్యంగా వస్తే టెన్షన్‌తో పరీక్షరాయడంలో ఇబ్బందులు పడే అవకాశముందని, కాబట్టి విద్యార్థులు ఉద యం 8.30గంటల కల్లా తమకు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

ఉదయం 9 గంటలకు ప్రశ్నపత్రాలు అందిస్తామన్నారు. ఈసారి ఈ పరీక్షలకు మొత్తం 9,96,971 విద్యార్థులు హాజరుకానుండగా, అందులో మొదటి సంవత్సరం వారు 4,88,448, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,08,523 మంది ఉన్నట్లు వెల్లడించారు.

పరీక్షలకు ఏర్పాట్లు ఇలా...

* ఈసారి తొలిసారిగా హాల్‌టికెట్లపై సెంటర్ లోకేటర్ క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. 

* పేపర్‌లీకేజీల నుంచి బయటపడేందుకు ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్, ప్రతీ ప్రశ్నాపత్రానికి యూనిక్ నెంబర్‌ను ముద్రించారు. 

* రాష్ట్రంలో మొత్తం 1,532 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు.

* మైనర్ మీడియం అయిన మరాఠీ, కన్నడ విద్యార్థులకు ముద్రిత ప్రశ్నాప్రతాలు కాకుండా, చేతిరాతతో రాసిన ప్రశ్నపత్రాలిస్తారు.  

* పరీక్షల నిర్వహణకు 72 ఫ్లయింగ్ స్క్వాడ్, 124 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు.

* 1,532 చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, 29,992 మంది మంది ఇన్విజిలెటర్లను నియమించారు.

* పరీక్షలకు వాచ్‌లను అనుమతించరు.