calender_icon.png 17 November, 2024 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కరోజులో రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

13-11-2024 12:00:00 AM

  1. నిలువునా పతనమైన మార్కెట్ 
  2. సెన్సెక్స్ 820పాయింట్లు, నిఫ్టీ 258 పాయింట్లు డౌన్
  3. బ్యాంకింగ్, పవర్, ఆటో షేర్లలో అమ్మకాల వెల్లువ

ముంబై, నవంబర్ 12:  ప్రతికూల గ్లోబల్ సంకేతాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వేగవంతంకావడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ నిలువునా పతనమయ్యింది. ఇంట్రాడేలో 948 పాయింట్ల వరకూ పడిపోయిన  బీఎస్‌ఈ సెన్సెక్స్ 78, 547 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 821 పాయింట్ల భారీ నష్టంతో 78,675 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 300 పాయిం ట్లకుపైగా పతనమై 23,839 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన అనంతరం 283 పాయింట్ల క్షీణతతో కీలకమైన 23,900 పాయింట్ల దిగువన 23,883 పాయింట్ల వద్ద  ముగిసింది.

సెన్సెక్స్ బాస్కెట్‌లో 25, నిఫ్టీ బాస్కెట్‌లో 45 షేర్లు నష్టాల్ని చవిచూశాయి. ఈ ఒక్కరోజులోనే రూ.5.29 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తరిగి పోయింది. ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.437.24 లక్షల కోట్లకు (5.18 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది.  స్టాక్ సూచీలు క్షీణించడం వరుసగా ఇది నాల్గవ రోజు. ఆసియా స్టాక్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌లు భారీగా తగ్గాయి. యూరప్‌లోని ప్రధాన మార్కెట్లయిన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు రెడ్‌లో ముగిసాయి. 

‘ట్రంపోనోమిక్స్’ భయాలు

విదేశీ ఫండ్స్ అమ్మకాల ఒత్తిడి దేశీయ స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నదని, ‘ట్రంపోనోమిక్స్’ భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.మంగళవారం మధ్యాహ్న సెషన్ వరకూ హెచ్చుతగ్గులకు లో నైన నిఫ్టీ ఒక్కసారిగా అమ్మకాల తాకిడికి కుప్పకూలిందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.

మారె ్కట్ వేళలు ముగిసిన తర్వాత ద్రవ్యోల్బ ణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్నందున, స్టాక్స్‌కు కొను గోళ్ల మద్దతు లభించలేదని వివరించారు అక్టోబర్‌లో రిటైల్ ద్ర వ్యోల్బణం 14 నెలల గరిష్ఠస్థాయి 6.21 శాతానికి పెరిగినట్లు నేషనల్ స్టాటస్టికల్ శాఖ ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ నెల లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 3.1 శాతానికి నెమ్మదించింది. 

ఎన్టీపీసీ టాప్ లూజర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఎన్టీపీసీ 3.15 శాతం తగ్గింది. ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతి, పవర్‌గ్రిడ్ షేర్లు 2.7 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు స్వల్పంగా లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అత్యధికంగా పవర్ ఇండెక్స్ 2.79 శాతం తగ్గింది.

యుటిలిటీస్ ఇండెక్స్ 2.20 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.14 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 1.95 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.82 శాతం,  మెటల్ ఇండెక్స్ 1.05 శాతం చొప్పున క్షీణించాయి. ఐటీ, రియల్టీ ఇండెక్స్‌లు గ్రీన్‌లో ముగిసాయి.బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.98 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.26 శాతం చొప్పున తగ్గాయి. 

తరలిపోతున్న విదేశీ స్టాక్ పెట్టుబడులు

 దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) నిధుల తరలింపు కొనసా గుతున్నది. మంగళవారం  విదేశీ ఫండ్స్  మరో రూ. 3,024 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడి స్తున్నాయి. దీనితో ఈ వారం తొలి రెండు రోజుల్లో రూ. 5,000 కోట్లకుపైగా ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నా రు. గతవారం ఐదు ట్రేడింగ్ రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ ఫండ్స్ విక్రయాలు రూ.20,000 కోట్లుగా నమోదయ్యాయి.