17-03-2025 12:42:27 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Budget Session) కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు ఐదు కీలక బిల్లులను తీసుకొచ్చింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిల్లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ బిల్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు, తెలుగు వర్సిటీ పేరు మారుస్తూ బిల్లు, పొట్టి శ్రీరాములు వర్సిటీ(Potti Sreeramulu Telugu University)ని సురవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీగా మారుస్తూ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు, పొట్టి శ్రీరాములు వర్సిటీ ఏపీలో అదే పేరుతో కొనసాగుతోంది. తెలంగాణ వచ్చాక అనేక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం. కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపుజీ, పీవీ నరసింహరావు పేర్లు పెట్టుకున్నాం. అదే ఒరవడిలో తెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సురవరం ప్రతాప్ రెడ్డి(Suravaram Pratapa Reddy) తెలంగాణకు, తెలుగు భాషకు ఎంతో సేవచేశారని సీఎం పేర్కొన్నారు.
సురవరం ప్రతాప్ రెడ్డి గోలకొండ పత్రిక(Golkonda magazine) నడిపారు. నిజాంకు వ్యతిరేకంగా సురవరం ప్రతాప్ రెడ్డి పోరాడారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆర్టీసీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్లు మార్చుకున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఒక్క కులం పట్ల ప్రత్యేక అభిమానం ఉందని విమర్శిస్తున్నారు. నాకే ఆ భావం ఉంటే మహిళ వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టేవాణ్నా?, మరో వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేవాణ్నా? అని సీఎం ప్రశ్నించారు. కులాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని రేవంత్ రెడ్డి హితువుపలికారు. గుజరాత్ లో ఓ స్టేడియానికి పటేల్ పేరు మార్చి మోదీ పేరు పెట్టారు.. మేం అలాంటి పనులు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక పేరుపై రెండు రాష్ట్రాల్లో రెండు వర్సిటీలు ఉండకూడదనే పేరు మారుస్తున్నామని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే వర్సిటీల పేర్లు మార్పు నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.