చెన్నై చెపాక్ స్టేడియాన్ని అప్రకటిత తుఫాన్ చుట్టుముట్టింది.. గంటకు వందమైళ్లకు పైగా స్పీడుతో బంతులు స్టేడియం అవతల పడ్డాయి. ఏవో పాత కక్షలు మనసులో పెట్టుకొని ఆడినట్లు.. బరిలోకి దిగిందే బంతి అంతుచూసేందుకు అన్నట్లు.. కసిదీరా కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న మన అమ్మాయిలు రికార్డుల దుమ్ముదులిపారు. వికెట్ల మధ్య పరుగులు తీసి అలసిపోవడం ఎందుకని భావించారేమో.. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. అసలు ఆడుతుంది టెస్టు మ్యాచా లేక టీ20నా అన్నట్లు భారత బ్యాటర్ల పరుగుల సునామీ సృష్టించారు. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో బ్యాటర్ల విధ్వంసంతో టీమిండియా తొలిరోజే 500 మార్క్‌ను అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది. షఫాలీ ద్విశతకానికి తోడు మంధన సుడిగాలి సెంచరీ బాదడంతో.. మహిళల టెస్టు క్రికెట్‌లో 89 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఏకైక టెస్టులో తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన టీమిండియా ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి..!
చెన్నై: వన్డే సిరీస్‌లో విజృంభించి దక్షిణాఫ్రికాను క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. ఏకైక టెస్టులోనూ అదే జోష్ కనబర్చింది. తొలి రోజే రికార్డులు తిరగరాస్తూ.. ఐదొందల పరుగులు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 98 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (194 బంతుల్లో 205; 23 ఫోర్లు, 8 సిక్సర్లు) డబుల్ సెంచరీతో మెరవగా.. స్మృతి మంధన (161 బంతుల్లో 149; 27 ఫోర్లు, 1 సిక్సర్) శతకంతో దుమ్మురేపింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ప్రపంచ రికార్డు స్థాయిలో 292 పరుగులు జోడించగా.. జేమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 55; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (76 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు), రిచా ఘోష్ (33 బంతుల్లో 43 నాటౌట్; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ 2 వికెట్లు తీసింది. తొలి రోజునే 500 పరుగుల మార్క్‌ను దాటిన భారత్ మరో 6 వికెట్లు చేతిలో ఉండడంతో భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.