25-02-2025 10:09:56 AM
అమరావతి: మహాశివరాత్రి ఉత్సవాల కోసం మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని అన్నమయ్య జిల్లాలోని తలకోనలో ఉన్న శివుని ఆలయానికి శేషాచలం అడవి గుండా వెళుతుండగా ఏనుగుల గుంపు దాడి చేయడంతో ఐదుగురు భక్తులు(Devotees) మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన ఓబులవారిపెల్లే మండలం గుండాలకోన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు అరుస్తూ ఏనుగులను భయపెట్టేందుకు ప్రయత్నించారని పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఏనుగులు కోపంతో వారిని చుట్టుముట్టి దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు.
కొందరు భక్తులు ప్రాణాల కోసం పరుగులు తీశారు కానీ ఏనుగులు కొందరిని తొక్కడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతి చెందిన భక్తులు రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపాడు గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.