భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు. మృతులు హైదరాబాద్‌లోని హయత్ నగర్ వాసులు హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్‌లుగా గుర్తించారు. చెరువులోంచి ఐదుగురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. అయితే వారిలో మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తున్న వీరు ఘటనా సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్కులే. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.