సిబ్బందిని అభినందించిన జీఎం అరుణ్ కుమార్ జైన్
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఇంధన పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే సత్తా చాటింది. 2024 ఏడాదిలో అత్యుత్తమ ఇంధన నిర్వహణకుగానూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వ హించిన కార్యక్రమంలో ద.మ.రైల్వేకు 5 అవార్డులు దక్కాయి. 25వ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ భాగంగా సీఐఐ ఈ అవార్డులను అందజేసింది. హైదరాబాద్ డివిజన్ భవనాల విభాగంలో నాలుగు, లాలాగూడలోని క్యారేజ్ వర్క్‌షాప్‌కు ఒక అవార్డు లభించింది.
హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేశ్ విష్ణోయ్, లాలా గూడలోని క్యారేజ్ వర్క్‌షాప్ అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం, హైదరాబాద్ భవన్ (హైదరాబాద్ డివిజన్ హెడ్ క్వార్టర్స్), సికింద్రాబాద్ లోని లేఖ భవన్, మౌలాలిలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, లాలాగూడలోని కారేజ్ వర్క్స్ షాప్‌లకు ఇంధన పొదుపు అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ద.మ. రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.