calender_icon.png 29 March, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు నిమిషాల్లోనే ఏటీఎం చోరీ

26-03-2025 02:40:19 PM

- రావిర్యాలలోని ఏటీఎం చోరీ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ 

- నిందితులందరూ జేసీబీ మెకానిక్ లు, వెల్డింగ్ నైపుణ్యం ఉన్నవారు 

- రాచకొండ సీపీ సుధీర్ బాబు

ఎల్బీనగర్ :  రంగారెడ్డి జిల్లా( Rangareddy District) మహేశ్వరం పరిధిలోని రావిర్యాలలో ఈ నెల 2వ తేదీన జరిగిన ఎస్బీఐ ఏటీఎంలో చోరీ కేసులో ఐదుగురు నిందితులను రాచకొండ పోలీసులు ఆరెస్ట్ చేశారు. బుధవారం ఎల్బీనగర్ లోని రాచకొండ క్యాంప్ కార్యాలయం(Rachakonda Camp Office)లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వీరి నుంచి రూ. 4 లక్షల నగదు, షిఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 9.50 లక్షలు ఉంటుంది. రాజస్థాన్గ్యా, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఐదుగురు కేవలం మూడు నిమిషాల్లోనే గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మిషన్ కట్ చేసి, అందులో 29,69,900 నగదును దోచుకెళ్లారు. అనంతరం బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ శ్రీవాణి ఫిర్యాదుతో ఆదిభట్ల సీఐ రాఘవేంద్ర రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ కేసు చేధించడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా రాజస్థాన్, హర్యానాకు చెందిన నేరస్తులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులు ఏటీఎం చోరీ కోసం రాజస్థాన్ కు చెందిన కారును వినియోగించారు. కారు కదలికలపై రాచకొండ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 24 నిందితులు ఆదే కారులో హైదరాబాద్ కు వచ్చి, తిరిగి ఏటీఎంలను చోరీ చేయడానికి ఇబ్రహీంపట్నం పరిధిలోని కొంగరకలాన్ గ్రామానికి వచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కారును గమనించిన ఐటీ సెల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న నిందితులను అరెస్టు చేశారు. వీరిని విచారించగా.. ఏటీఎం చోరీ చేసినట్టు అంగీకరించారు. దీంతో నిందితులు రాహుల్ ఖాన్, ముస్తఖీం ఖాన్, షకీల్ ఖాన్, వాహిద్ ఖాన్, షారుఖ్ బషిర్ ఖాన్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిలో రాహుల్ ఖాన్ గతంలో వివిధ రాష్ట్రాల్లో ఏటీఎంలను చోరీ చేశాడు.

ఇతడి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఏటీఎంలను కొల్లగొట్టారు. నిందితులందరూ జేసీబీ హవానాల మెకానిక్ లు, ఆపరేటర్ గా పని చేస్తున్నారు. వీరికి వెల్డింగ్ పనిలో సైతం ప్రావీణ్యం ఉందన్నారు. తాము చేస్తున్న వృత్తి నైపుణ్యాన్ని చోరీ చేయడానికి వినియోగిస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు వివరించారు. నిందితుల్లో రాహుల్ ఖాన్ గతంలో  హైదరాబాద్, ఒరిస్సాల్లో గ్యాస్ కట్టర్లతో ఏటీఎం చోరీలకు పాల్పడ్డాడు. చోరీ కేసుల్లో జైలుకు వెళ్లిన రాహుల్ ఖాన్ తీరు మారలేదు. ఈజీ మనీ కోసం ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నారు. నిందితుల్లో ఒకరు సీసీటీవీ కెమెరాలకు స్ప్రే చేస్తే, మరొకరు అలారం వైర్లను కట్ చేస్తారు.

రాహుల్ ఖాన్, రఫిక్ ఖాన్ ఇద్దరు గ్యాస్ కట్టింగ్ లో నేర్పరితనం ఉంది. డబ్బులు కాలిపోకుండా ఏటీఎం మిషన్ లో డబ్బులు చోరీ చేయడంపై యూట్యూబ్ లలో చూసి, అవగాహన పొందారు. ప్రధాన నిందితుడు రాహుల్ ఖాన్ పహాడీ షరీఫ్ లో మెకానిక్ షెడ్ లో పని చేశాడు. మిగతా నిందితులు పటాన్ చెర్వు ఏరియాలో పని చేస్తున్నారు. రావిర్యాల చోరీ  చేసిన అనంతరం వెళ్తూవెళ్తూ మైలర్ దేవ్ పల్లి లో కూడా ఏటీఎం చోరీకి యత్నించారు. చోరీ విఫలం కావడంతో రోడ్డు మార్గంలో రాజస్థాన్ కు వెళ్లినట్లు తెలిపారు. చోరీ కేసును ఛాలెంజ్ గా తీసుకుని, 23 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.