calender_icon.png 23 February, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిట్‌నెస్ ఫీజు పెంపు?

22-02-2025 01:05:33 AM

  1. భారీ వడ్డనకు సిద్ధమైన కేంద్ర రవాణా శాఖ
  2. వాహనాల ఫిట్‌నెస్, గ్రీన్‌ట్యాక్స్ పెంపుపై ప్రతిపాదనలు
  3. 27 వరకు అభ్యంతరాల స్వీకరణ 

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): 15 ఏళ్ల గడువు తీరిన వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్, గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి తమ వాహనం కాలపరిమితిని మరో 5 ఏళ్లకు పెంచుకునేందుకు ఉన్న వెసులుబాటును మరింత కఠినతరం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నూతన ట్యాక్స్‌లపై ప్రతిపాదనలు విడుదల చేసి వాహనదారుల అభ్యంతరాలను కేంద్ర రవాణా శాఖ స్వీకరిస్తోంది.

కేంద్రం ప్రతిపాదించిన ట్యాక్స్‌ల ప్రకారం 15 ఏళ్ల  తర్వాత వాహనం రీరిజిస్ట్రేషన్ రెన్యూవల్ కోసం భారీగా రుసుములు పెరిగాయి. ఇక 20 సంవత్సరాల పైబడితే మరింత ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు ఫిట్‌నెస్ టెస్టింగ్ మాన్యువల్ లేదా ఆటోమేటెడ్‌గా చేయించుకోవాల్సి ఉంటుంది. స్క్రాప్ పాలసీని అనుసరించి పాత వాహనాలను స్క్రాప్ చేయనున్నారు.

ప్రస్తుతం ఉన్న ట్కాక్స్‌తో పోలిస్తే రెట్టింపు ట్యాక్స్ వసూలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. కాలం చెల్లిన వాహనాలను కచ్చితంగా స్క్రాప్ చేసేందుకు ట్యాక్స్‌లు పెంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన గెజిట్‌పై వాహనదారులు, ప్రజల అభిప్రాయాలను ఈ నెల27 వరకు తీసుకోనున్నారు. ఆ తర్వాత రాష్ట్రాలకు కేంద్రం సర్క్యులర్‌ను పంపి కొత్త ట్యాక్స్ విధానాలను నిర్దేశించే అవకాశం ఉంది. 

వాహనదారులపై భారీ భారం

కేంద్రం కొత్తగా తీసుకురావాలనుకుంటున్న ఫిట్‌నెస్, గ్రీన్‌ట్యాక్స్‌ల వల్ల వాహనదారులపై భారీగా భారం పడనుంది. బైక్, కార్లు, ఆటోలు, ట్రక్కులు, బస్సుల యజమానులు, ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు, క్యాబ్, ఆటోరిక్షా డ్రైవర్లపై కేంద్రం పెంచనున్న ట్యాక్స్‌ల భారం దాదాపుగా రెట్టింపు కానుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు తమ లైసెన్సు రెన్యువల్ చేయాలంటే కచ్చితంగా ఫిట్‌నెస్ టెస్ట్ కోసం ట్యాక్స్ చెల్లించి ఆ తర్వాత గ్రీన్‌ట్యాక్స్ (రీరిజిస్ట్రేషన్) చేసుకోవాల్సి ఉంటుంది.

పాత వాహనాలు ఎక్కువ కాలుష్యం ఉత్పత్తి చేసే అవకాశముండటంతో గ్రీన్‌ట్యాక్స్ రూపంలో అదనపు ట్యాక్స్‌లను విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. 15 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకునేందుకు ఫిట్‌నెస్ టెస్టింగ్ తప్పనిసరి. ఇక 20 ఏళ్లు దాటిన వాహనాలకు మరింత కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఫిట్‌నెస్ టెస్టింగ్ మాన్యువల్ లేదా ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్‌లో చేయించుకోవాలి.

ఇవీ నిబంధనలు..

గ్రీన్‌ట్యాక్స్ చెల్లించకపోతే 15 ఏళ్లు దాటిన వాహన రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. ఫిట్‌నెస్ టెస్టింగ్ ఫెయిల్ అయితే వాహనాన్ని నడపకూడదు. 15 ఏళ్ల మధ్య వాహనాలకు గ్రీన్‌ట్యాక్స్, ఫిట్‌నెస్ రెన్యూవల్ తప్పనిసరి. 20 ఏళ్లు దాటితే స్క్రాప్ పాలసీ లేదా అధిక రుసుముతో రెన్యూవల్  చేసుకోవాల్సి ఉంటుంది.

డీజిల్ వాహనాలకు మరింత కఠినమైన నిబంధనలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి, ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ అయితే వాహనం ఉపయోగించుకోవచ్చు. లేదంటే కచ్చితంగా స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. లేదా అధిక రుసుముతో రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయాలి. దీంతో వాహనదారుల్లో టెన్షన్ మొదలైంది.