అతనో దివ్యాంగుడు.. అయితేనేం తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టాడు. తన ఒక్కడితోనే తెలంగాణ సాధ్యంకాదని నమ్మి జాయింట్ యాక్షన్ కమిటీలకు పునాది వేశాడు. అంగవైకల్యాన్ని అధిగమించి ‘ఇంతింతై వట్టుడింతై’ అన్నట్టుగా సకల జనుల సమ్మె, నిరాహారదీక్షలు, ధూంధాం కార్యక్రమాలతో కదం తొక్కాడు. ‘ఎల్‌బీ నగర్ జేఏసీ కన్వీనర్’గా తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు. ఆయనే చామకూర రాజు అలియాస్ పిడికిలి రాజు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, ఆనాటి ఉద్యమ సంగతులను విజయక్రాంతితో వివరించారిలా..
డిసెంబర్ 3, 2009.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఎల్‌బీ నగర్ చౌరస్తాలో తనను తాను పెట్రోల్‌తో కాల్చుకొని తృణప్రాయంగా ప్రాణాన్ని త్యజించాడు. కళ్లేదుటే ఓ నిండు ప్రాణం కోల్పోవడం నన్న తీవ్రంగా కలిచివేసింది.
అంతేకాదు.. మలిదశ ఉద్యమంలో కీలక పోరాటాలన్నీ ఎల్‌బీ నగర్ కేంద్రంగా జరిగేవి. ఇవన్నీ నన్ను ఉద్యమం వైపు కదిలించేలా చేశాయి. ఎందుకంటే చిన్నప్పట్నుంచే నాలో ఉద్యమ స్ఫూర్తి ఎక్కువగా ఉండేది. మాది సిద్దిపేట జిల్లా చిన్నకూడురు అనంతసాగర్ గ్రామం. పెరిగిన గ్రామీణ పరిస్థితులు, సమాజంలో ధనిక తేడాలు నన్ను కుదురుగా ఉండనిచ్చేవికావు. దాంతో చిన్నప్పట్నుంచే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేవాడ్ని. అయినా ఏ ఒక్కరోజు చదువును నిర్లక్ష్యం చేయలేదు.
జర్నలిస్టుల సమస్యలపై..
పాలిటెక్నిక్ చదివేందుకు 1991లో సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చా. అయితే బాల్యం నుంచే అనేక సామాజిక సమస్యలపై బాగా అవగాహన ఉంది. భావి భారతాన్ని తీర్చిదద్దడంలో విద్యార్థుల పాత్ర చాలా గొప్పది.
ఈ కారణంతోనే విద్యార్థి సమస్యలపై స్పందించి పోరాటం చేసేవాడ్ని, మలక్‌పేట, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్ నగర్ ప్రాంతాల్లో చదివే విద్యార్థుల సంక్షేమం కోసం అనేక ధర్నాలు చేశా. ఆ తర్వాత ఎన్‌ఎస్‌యూఐలో చేరి హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించా. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందేలా అధికారులుపై ఒత్తిడి తెచ్చా. అయితే అప్పట్లో ఎన్నో సామాజిక సమస్యలున్నా వెలుగులోకి వచ్చేవి కావు.
అందుకే పాత్రికేయం వైపు అడుగులు వేశా. అయితే నేను పనిచేసే సమయం లో జర్నలిస్టులపై ఎన్నో ఆంక్షలు ఉండేవి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా రాస్తే కేసులు పెట్టేవారు. అందుకే జర్నలిస్టుల సంక్షేమం కోసం ‘ఎల్‌బీ నగర్ జర్నలిస్ట్ అసొసియేషన్’ ఏర్పాటు చేశా. బడా నాయకుల కారణంగా చిన్న పత్రికల రిపోర్టర్లు జైలుపాలు అయ్యేవారు. వారిని విడిచిపెట్టేందుకే అనేక పోలీస్ స్టేషన్ల ముందు మెరుపు ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి.
మలుపు తిప్పిన ఉద్యమం
ఆనాడు ఆంధ్రపెత్తనం ఎక్కువగా ఉండేది. ఈ కారణమే నన్ను తెలంగాణ ఉద్యమంవైపు అడుగులు వేసేలా చేసింది. మలిదశ ఉద్యమంలో ఏ కార్యక్రమం జరిగినా ఎల్‌బీ నగర్ కేంద్రంగా ఎక్కువగా జరిగేవి. ఉద్యమాలతో తెలంగాణ సాకారమవుతుందనే ఉద్దేశంతో నాలాంటివాళ్లను కలుపుకొని ‘ఎల్‌బీ నగర్ జాయింట్ యాక్షన్ కమిటీ’ (అనధికారికంగా) ఏర్పాటు చేశా.
2010లో మా జేఏసీ ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె నిర్వహించా. దానికి ఊహించనివిధంగా వెయ్యి మంది ఉద్యమకారులు హాజరయ్యారు. హైదరాబాద్ చరిత్రలోనే అప్పట్లో ఓ సంచలనంగా మారింది. ఆ సమ్మె ప్రభుత్వాన్ని కదిలించింది. దాంతో పోలీసులు ప్రతి క్షణం ఎల్‌బీ నగర్‌పై డేగ కన్ను వేసేవారు. ఈ సకల జనుల సమ్మె తర్వాతనే కోదండరాం, దేశపతి లాంటివాళ్లను కలుసుకోగలిగాను.
నేను చేసే ఉద్యమాలు తీవ్ర ప్రభావం చూపడంతో అధికారికంగా నన్ను జేఏసీ కన్వీనర్‌గా నియమించారు. ఇక ఆరోజు నుంచే ఉద్యమమే ఊపిరిగా బతికాను. నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, బతుకమ్మలతో నిరసన, ధూంధాం లాంటి కార్యక్రమాలు నిరవధికంగా నిర్వహించేలా చేశా. జేఏసీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా అన్ని రంగాలవారు (విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులు, అధ్యాపకులు) ప్రతిఒక్కరూ పాల్గొని మద్దతు ఇచ్చేవారు. తెలంగాణ ఉద్యమం మొదలుకొని.. మహనీయుల జయంతి, వర్థంతి వేడుకల వరకు ప్రతి కార్యక్రమం నిర్వహించా.
విద్యార్థుల ఆత్మహత్యలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009లో శ్రీకాంతాచారి మరణించిన విషయం తెలిసిందే. ఆయన బలిదానం నన్నే కాదు.. తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కదిలించింది. ఆ తర్వాత యాదయ్య, వేణుగోపాల్ లాంటివాళ్లు చనిపోయారు.
అయితే ‘ఆత్మ బలిదానం చేసుకుంటనే తెలంగాణ వస్తది’ అనే కారణంలో ఎంతోమంది విద్యార్థులు ప్రాణ త్యాగాల కు సిద్ధపడేవారు. పెట్రోల్ బాటిళ్లు పట్టుకొని రొడ్డెక్కేవారు. ఈ పరిస్థితి మార్చడం కోసం ‘ఆత్మహత్య చేసుకోవద్దు.. విలువైన జీవితాలను బలితీయొద్దు’ అనే లక్ష్యంతో ఆత్మహత్యలపై హైదరాబాద్‌లోని అన్ని విద్యాలయాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అంతేకాదు వాళ్లతో స్వయంగా ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేయించి.. కొంతవరకు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశా. ఎల్‌బీ నగర్‌లో ‘ఆత్మహత్యల నివారణ’ కార్యక్రమం పేరుతో వేలాది మంది విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించా. మా ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాల తర్వాతనే విద్యార్థులు ఉద్యమ కార్యక్రమాల్లో భాగమయ్యారు.
కొండా లక్ష్మణ్ స్ఫూర్తితో..
తెలంగాణ ఉద్యమ ప్రముఖుల్లో ఒకరైన కొండా లక్ష్మణ్ బాపూజీ నా చొరవను గుర్తించి ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ఆయన ఏర్పాటు చేసిన ‘తెలంగాణ సంయుక్త సాధన సమితి’ కమిటీలో స్టీరింగ్ కమిటీ మెంబర్‌గా అవకాశం దక్కింది. ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు అప్పట్లో నిజాం కాలేజీలో ఈ కమిటీ పెద్ద బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించింది. ఆ తర్వాత రైల్‌రోకోలు, వంటావార్పులు, నిరాహార దీక్షలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం.
తెలంగాణ అందరిదీ..
నేనో దివ్యాంగుడిని అయినప్పటికీ.. మేధావులు, ఉద్యమకారులు ప్రతిఒక్కరూ నా కార్యక్రమాలను విజయవంతం చేశారు. అయితే అప్పట్లో మేం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో పిడికిలి అనే మ్యాగజైన్ నడిపాను. దాంట్లో తెలంగాణ ఎందుకు సాధించుకోవాలి? అనే ఆవశ్యకతపై ఎన్నో కథలు, వార్తలు రాసి చైతన్యం తీసుకొచ్చా.. తెలంగాణ ఉద్యమానికి నాలాంటివాళ్లు పిడికిలైనప్పటికీ.. సరైన గౌరవం దక్కలేదని బాధ ఉంది. ఏ ప్రభుత్వమైనా సరే తెలంగాణ అమరవీరులను, ఉద్యమకారులను గుర్తించినప్పుడే ఉద్యమ ఫలాలు అందిరికీ దక్కుతాయి. గత ప్రభుత్వాలు కొందరిని మాత్రమే ఉద్యమకారులుగా గుర్తించి సత్కరించాయి. ఇది సరైంది కాదు.