14-02-2025 12:23:53 AM
వనపర్తి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో మత్య్స సంపద పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తూ ప్రాజెక్టులు, చెరువుల్లో వదులుతోంది. ఈ చేపపిల్లలు పెరిగిన తర్వాత స్థానిక మత్య్సకారులు వాటిని పట్టుకుని అమ్ముకుని జీవనోపాధి కల్పించుకుంటున్నారు.
కొంతమంది దళారులు ఆంధ్రా జాలర్లను పిలిపించి చేప పిల్లలను ఎదగనీయకుండా, పునరుత్పత్తి జరగనివ్వకుండా నిషేధిత అలవి వలలను ఉపయోగించి మత్య్స సంపద అంతా దోచేస్తున్నారు. దీంతో మత్య్సకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో చేపపిల్లలను వదిలినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
జూన్ నుంచి మార్చి వరకు శ్రీశైలం ప్రాజెక్టులో బ్యాక్‌వాటర్ నిల్వ ఉంటుంది. ఈ సమయంలో చేపల ఉత్పత్తి ఘనంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాని చిన్నంబావి మండలంలోని నదీతీర గ్రామాలైన గూడెం, పెద్దమారు, చిన్నమారు, వెలటూర్, కాలూర్, చెల్లెపాడు ప్రాంతాల్లో నిషేధిత అలవి వలలతో మత్య్ససంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు.
చిన్నంబావి మండలంలో జోరుగా..
జిల్లా పరిధిలోని కృష్ణానది నదీపరివాహక మండలం అయిన చిన్నంబావిలో జోరుగా నిషేధిత అలవి వలలను వాడుతున్న సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా నామమాత్రపు దాడులు నిర్వహించి కేసులను నమోదు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారని, దీనివల్ల స్థానిక మత్య్సకారులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలవి వలల వేటను నిషేధించినప్పటికీ ఈ దందా కొనసాగడం గమనార్హం.
నష్టపోతున్న స్థానిక మత్య్సకారులు
అలవి వల సాధారణంగా చాలా పెద్దగా ఉంటుంది. ఈ వల 80 నుంచి 100 మీటర్ల పొడవు ఉంటుంది. దీనికి పెద్ద చేపలతో పాటు చిన్నవి సైతం చిక్కుతాయి. కృష్ణా నది (శ్రీశైలం బ్యాక్‌వాటర్) తగ్గుముఖం పట్టిన సమయంలో కొంతమంది దళారులు అత్యాశతో ఆంధ్రాలోని విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రాంతాల నుంచి ఆంధ్రా జాలర్లను తీసుకొచ్చి అలవి వలలతో చేపలను పట్టిస్తుండటంతో చిన్న చేప పిల్లలు కూడా ఈ వలలో చిక్కుకుంటున్నాయి.
ఎంతలా అంటే నీళ్లలో ఉండే అగ్గిపుల్ల సైతం ఈ వలలో పడితే ఇక బయటకు పోదు. దీంతో మత్స్య సంపద పెరగకుండా అడ్డుకుంటున్నట్లు అవుతోంది. అలవి వల ద్వారా పట్టిన చిన్న చేపలను ఆరబెట్టి విక్రయిస్తే ఇతర రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంటోంది. చిన్న చేపలకు కేజీ రూ.80 నుంచి 200 వరకు , పెద్ద చేపలు కిలో రూ.60 నుంచి 120 వరకు విక్రయిస్తారు.
ఉదయం మొత్తం రెస్ట్ తీసుకుని రాత్రివేళ్లలో వేట మమ్మురంగా సాగుతుంది. తీర ప్రాంతాల్లో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన జాలర్లు గుడారాలు వేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆయా కుటుంబాలకు వ్యాపారులు కొద్ది మొత్తం అడ్వాన్స్ రూపంలో ఇచ్చి తీసుకుని వచ్చి నదీతీర ప్రాంతంలో అలవి వేటకు ఉపయోగించుకుంటున్నారు.
దాడులకు ముందే పక్కా సమాచారం..
కృష్ణానది తీర ప్రాంతంలో అలవి వలల వేట యథేచ్ఛగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా అధికారులు దాడులు చేయా లని అలవి వలల స్థావరాలకు వెళ్లేకన్నా ముందే అక్కడ ఉన్న ఆంధ్రా జాలర్లకు సమాచారం అం దుతుండటంతో అలవి వలలు కనిపించకుండా దాచిపెడుతున్నారు. దాడులు జరగక ముందే సమాచారం లీక్ కావడంపై స్థానిక మత్య్సకారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అలవి వలలు వాడితే చర్యలు తప్పవు..
నిషేధిత అలవి వలలతో వేటలో పాల్గొన్న జాలర్లు, అందుకు సహకరించే వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం. నిషేధిత అలవి వలలను రాష్ట్రంలో నిషేధించారు. నిషేధిత అలవి వలలపై ఇప్పటికే పలుమార్లు కేసులను సైతం నమోదు చేశాం. ఎవరైనా నిషేధిత అలవి వలల ద్వారా చేపలను పట్టుకుంటున్నట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలి.
లక్ష్మప్ప,
మత్య్స శాఖ అధికారి, వనపర్తి జిల్లా