09-03-2025 12:26:38 AM
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): అంకుర సంస్థలకు మార్గదర్శకం చేస్తూ, వాటి సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మత్స్యరంగానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పేర్కొన్నారు. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా శనివారం ఫిషరీస్ స్టార్టప్ కాన్‌క్లేవ్ 2.0ను నిర్వహించారు.
కార్యక్రమాన్ని కేంద్ర సహాయమంత్రి ఎస్పీఎస్ బఘేల్, నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్‌చంద్‌తో కలిసి రంజన్‌సింగ్ ప్రారంభించారు. మత్స్యరంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకుం మత్స్య శాఖ ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0ను నిర్వహించిందని కేంద్రమంత్రి తెలిపారు. మత్స్య, ఆక్వా రంగంలో వినూత్న అంకుర సంస్థల ను గుర్తించి, వాటికి అవసరమైన మద్దతునిస్తూ వాటిని ప్రోత్సహించడమే కార్యక్రమ లక్ష్యమన్నారు.
ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0లో విజేతలుగా నిలిచే 10 అంకుర సంస్థలకు రూ.కోటి నిధులను సమకూర్చడం ద్వారా మత్స్య రంగానికి ఊతం లభిస్తోందన్నారు. మత్స్య రంగ అంకురసంస్థల సదస్సు 2.0లో భాగంగా పీఎమ్-ఎమ్‌కేఎస్‌ఎస్‌వై ప్రయోజనాలను విస్తరించే లక్ష్యంతో ఎన్‌ఎఫ్‌డీపీ మొబైల్ యాప్‌ను కేంద్రమంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ ప్రారంభించారు. వినియోగ దారులు ముఖ్యంగా అంకుర సంస్థలు వివిధ విభాగాలను గురించి తెలుసుకోవడానికి, పథకం ప్రయోజనాలను పొందడానికి ఈ యాప్ సులభమైన ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.