22-04-2025 01:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): సులువుగా చేపలు పట్టాలనే కొత్త తలంపు ప్రాణాల మీదకు తెస్తోంది. నీటిలో ఉండే చేపలకు విద్యుత్ షాక్ పెట్టి పట్టే పద్ధతిని ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో చాలామంది అనుకరిస్తున్నారు. అయితే పలు సందర్భాల్లో చేపల వేట కాస్త ప్రాణాలతో చెలగాటంగా మారుతోంది.
జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో గత రెండు నెలలుగా కరెంటు షాక్ తో చేపలు పట్టేందుకు వెళ్లి పలువురు దుర్మరణం పాలైన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా కరెంటు షాక్ తో చేపల వేట మాత్రం ఆపడం లేదని విమర్శలు వస్తున్నాయి. 100 నుండి 150 రూపాయలు పెట్టి చేపలు కొనుక్కొని తినే పరిస్థితి ఉన్నప్పటికీ కొందరు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నెల్లికుదురు మండలం పడమటి గడ్డ తండాలో రెండు నెలల క్రితం జాటోత్ రెడ్యా అనే వ్యక్తి వాగులో చేపలకు విద్యుత్ షాక్ పెట్టి పట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. అలాగే మేతరాజు పల్లి కుమ్మరి కుంట చెరువులో పెద్ద తండా కు చెందిన బాధావత్ శేఖర్, భూక్య రాములు చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు.
ఇక నరసింహుల పేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన దుండి ఉప్పలయ్య వెంకమ్మ చెరువు మత్తడి దగ్గర నీరు నిలువ ఉన్న గుంటలో చేపలను పట్టేందుకు కరెంటు షాక్ పెట్టి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ కు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కొమ్ముల వంచ గ్రామంలో మహేష్ అనే వ్యక్తి కూడా చేపల వేటకు వెళ్లి మరణించాడు. అలాగే మరిపెడ మండలం గుర్రపు తండాకు చెందిన హలవత్ గణేష్ చేపల వేటకు వెళ్లి మరణించాడు.
ఇదే మండలం పురుషోత్తమాయగూడెం కు చెందిన జరుపుల శివ కూడా చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఇలా జిల్లావ్యాప్తంగా గడచిన మూడు, నాలుగు మాసాల్లో పదిమందికి పైగా చేపల వేటకు వెళ్లి దుర్మరణం పాలు కావడం సంచలనం సృష్టిస్తోంది. చేపల వేటకు ప్రాణాలను పణంగా పెట్టడం.. అందులో యుక్తవయసులో ఉన్న వారే ఎక్కువ సంఖ్యలో చనిపోవడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.
చేపల వేటలో.. విద్యుత్తు వినియోగం ప్రమాదకరమని తెలిసినప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం సరైనది కాదని పేర్కొంటున్నారు. ప్రాణాంతకంగా మారిన కరెంటుతో చేపల వేటకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
చేపల వేటకు విద్యుత్తు వినియోగం నేరం
వాగులు, మడుగుల్లో చేపల వేటకు విద్యుత్ వినియోగం నేరం. అలాంటి ఘటనలకు పాల్పడితే చట్టరీత్య చర్యలు తప్పవు. ప్రాణాంతకమని తెలిసినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లలు, యువకులు చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నిరోధించాలి. ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయడంతో చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉందని, చెరువులు, వాగుల్లో ఈతరానివారు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలి. వేసవి కాలం నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఉండాలి.
- సర్వయ్య,
మహబూబాబాద్ రూరల్, సీఐ