calender_icon.png 19 September, 2024 | 10:40 PM

చెరువుకు చేరని చేప

17-09-2024 12:48:59 AM

  1. ఉచిత పంపిణీపై అయోమయం 
  2. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే మూడుసార్లు టెండర్లకు పిలుపు 
  3. అయినా కాంట్రాక్టర్ల నుంచి నో రెస్పాన్స్ 
  4. ఈనెల 19న మరోసారి టెండర్లకు పిలుపు

రంగారెడ్డి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): పల్లెలు, పట్టణాల్లో మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి 2016లో శ్రీకారం చుట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి చేపల దిగుమతికి చెక్ పెట్టడంతో పాటు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన చేపలను అందుబాటులో తక్కువ ధరకు అందించాలని ప్రభుత్వం సంక్పలించింది. అప్పటి నుంచి ప్రతియేటా వర్షాకాలంలో క్రమం తప్పకుండా జిల్లాలో గుర్తించిన చెరువులో టెండర్లను పిలిచి చేప పిల్లలను వదిలే ప్రక్రియ సజావుగా చేపట్టింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పలు చెరువులు, కుంటలు నిండుకుండలాగా మారాయి.

అయితే, ప్రస్తుతం ప్రభుత్వం చెరువులో చేపల పంపిణీ పథకంపై  ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మత్స్యకారుల్లో కొంత ఆందోళన నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో 186 మత్స్యకారుల సంఘాలలో మొత్తం 9,136 మంది సభ్యు లు ఉన్నారు. అయితే, గత ఏడేళ్లుగా సంఘం సభ్యులంతా తమ పరిధిలోని చెరువులో పెరిగిన చేపలను పట్టుకొని జీవనోపా ధిని పొందుతూ కొంత ఆర్థికంగా స్థిరపడ్డారు. ఈ ఏడాది చేపల పంపిణీ పథకంపై ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో సభ్యులంతా అసలు చేపల పంపిణీ ఉంటుందా.. ఉండ దా అనే అయోమయం నెలకొంది. జిల్లాలో ఉచిత చేపల పంపిణీ కోసం ప్రభుత్వ రూ.114 కోట్లు కేటాయించింది  ప్రభుత్వం మూడుసార్లు టెండర్ల ప్రక్రియ చేపట్టినా గుత్తేదారులు ముందుకు రావడం లేదు.  

నిండుకుండలా చెరువులు.. 

జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు షాద్‌నగర్, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో పలు చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. జంట జలాశయాలు సైతం నీటితో కళకళలాడుతుండ డంతో మత్స్యకారులో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో ఈ సమయానికే చేప పిల్లలను వదిలే ప్రక్రియను పూర్తి చేసేవారు. సరైన సమయంలోనే చేపలను వదిలితే అవి బాగా ఎదిగి మత్స్యకారులు మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఈ ఏడాది 813 చెరువులు, కుంటల్లో 1.93 కోట్ల చేప పిల్లలను వదలాలని అధికారులు ఫైల్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. చేప పిల్లలను వదిలే ప్రక్రియలో భాగంగా జూలై 10 నుంచి ఇప్పటివరకు మూడుసార్లు టెండర్లకు అధికారులు కాల్ చేశారు.

కానీ, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. పూర్తి వివరాలను తెప్పించుకొన్న అధికారులు మళ్లీ నాలుగోసారి ఈ నెల 19న టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో   టెండర్లు దక్కించుకున్న పలువురు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లిం చకపోవడంతోనే ఇప్పుడు ముందుకు రావ డం లేదని సమాచారం. ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ సహకార అధికారి నర్సింహారావును వివరణ కోరగా.. ప్రభుత్వం చేప పిల్లల పంపిణీపై దృష్టి సారించిందని, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి చేప పిల్లల పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

సీడ్ పంపిణీని సొసైటీలకు అప్పగించాలి.. 

చేప పిల్లల సీడ్ కోసం టెండర్ల ప్రక్రియకు స్వస్తి పలికి నిధులను నేరుగా సంఘం సభ్యుల ఖాతాలో జమ చేయాలి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు అదనంగా సభ్యులు కొంత డబ్బులను పోగు చేసుకొని నాణ్యమైన సీడ్‌ను కొనుగోలు చేస్తారు. టెండర్లు దక్కించు కున్న వారు నాణ్యమైన సీడ్ ఇవ్వకపోవడంతో మత్స్యకారులకు నష్టం వాటిల్లుతోంది. చేపలు పావు కిలోకి మించి పెరగడం లేదు. ప్రతియేటా జూన్‌లోనే ఈ ప్రక్రియను ప్రారంభించాలి. కానీ, ఈ ఏడాది సెప్టెంబర్ దాటినా ప్రక్రియ ముందుకు పోలేదు. పంపిణీలో ఆలస్యం అయితే చేపలు ఎదుగూబొదుగు లేకుండా ఉంటా యి. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న ఇబ్ర హీంపట్నంలో రాష్ట్రస్థాయి మత్స్యకారుల సభను నిర్వహిస్తున్నాం. 

 గోరెంకల నర్సింహ, రాష్ట్ర మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు