calender_icon.png 23 October, 2024 | 8:32 PM

టేకులపల్లిలో చేప పిల్లల పంపిణి

23-10-2024 06:21:51 PM

అదను తప్పాక చేప పిల్లల పంపిణి 

ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్చ్యకారులు 

కొత్తగూడెం: రైతు వ్యవసాయం చేసేందుకు భూమిలో పదును, అదును ఉండాలనేది అందరికీ తెలిసిందే. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మత్చ్య శాఖ తీరు దానికి విరుద్దంగా ఉంది. ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో బుధవారం మత్చ్య శాఖ ఆధ్వర్యంలో చేపల సొసైటీలకు చేపపిల్లలు పంపిణీ చేశారు. ఆగష్టు నెలలో ఇవ్వాల్సిన చేపపిల్లలు అక్టోబర్ నెలలో ఇస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిస్తే ఎదుగుదల ఉండదని, వాటికి వేసే మేత కూడా ఇప్పటికే చెరువులో ఉండే పెద్ద చేపలు తిని, పిల్లలకు ఆహారం అందదని అంటున్నారు.

ఆ శాఖ అధికారులు మాత్రం పిల్లలు సరఫరా చేసే గుత్తేదారు చేసిన ఆలస్యంతోనే రైతులకు సకాలంలో ఇవ్వలేక పోయామని అంటున్నారు. తీసుకొచ్చిన చేప పిల్లలు ఉదయాన్నే ఇవ్వాల్సి ఉండగా, సాయంత్రం వరకు ఇవ్వకుండా వాహనంలోనే మండుటెండలో ఉంచడం విశేషం. హడావిడిగా పంపిణీ చేయడంపై రైతులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల తర్వాత పంపిణీ చేయడం వలన ఉపయోగం లేదని అంటున్నారు. పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్ నాగ భవాని, ఎంపీడీఓ రవీందర్ రావు, ఎంపీఓ గణేష్ గాంధీ, మత్చ్య శాఖ ఏడీఏ మహ్మద్ ఇంతియాజ్ ఖాన్, సిబ్బంది ఇంతియాజ్, కోటేశ్వర్ రావు, అనిల్, సొసైటీ చైర్మన్, రైతులు పాల్గొన్నారు.