న్యూఢిల్లీ, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వం పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించిన లక్ష్యంలో ద్రవ్యలోటు అక్టోబర్ చివరికల్లా 46.5 శాతానికి చేరింది. ప్రభుత్వ రెవిన్యూ వ్యయం, ప్రభుత్వ పన్నుల ఆదాయం మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటు ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్‌లో రూ.7,50,824 కోట్లకు చేరినట్లు కంట్రోలర్ జనరల్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం వెల్లడించింది.
ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును రూ.16,13,312 లక్షల కోట్లకు అదుపుచేయాలని (జీడీపీలో 4.9 శాతం) బడ్జెట్లో లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ఈ లోటు లక్ష్యంలో 46.5 శాతానికి చేరుకున్నది. నిరుడు ఇదేకాలంలో ఇది 45 శాతంగా ఉన్నది.
గత పూర్తి ఏడాదిలో ద్రవ్యలోటు జీడీపీలో 5.6 శాతానికి చేరింది. ఈ ఏప్రిల్ రూ.13 లక్షల కోట్ల నికర పన్నుల ఆదాయం (బడ్జెట్ అంచనాల్లో 50.5 శాతం), ఇదే కాలంలో వ్యయం రూ. 24.7 లక్షల కోట్లుగా (బడ్జెట్ అంచనాల్లో 51.3 శాతం) ఉన్నది. ఇందులో రెవిన్యూ వ్యయం రూ.20 లక్షల కోట్లుకాగా, మూలధన వ్యయం రూ.4.66 లక్షల కోట్లని సీజీఏ తెలిపింది.