18-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ఏఐ సాంకేతికతతో తొలి తెలుగు జానపద గీతం విడుదల అయ్యింది. రోజురోజూకీ మన జీవితంలో భాగమవుతున్న కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు మన తెలుగు జానపద గీతాలు కూడా పాడేస్తుంది. దీనిని కిన్ని మ్యూజిక్ స్టూడియోస్ అనే యూ ట్యూబ్ ఛానల్ సాకారం చేసింది.
ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిన్ని మ్యూజిక్ స్టూడియోస్ కి చెందిన కిషోర్ కుమార్ ఏనుగు రచించిన ’ఈ పిల్ల’ అనే జానపద గీతం (ఫోక్ సాంగ్) ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటకు సంబందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిమిషాల వ్యవధిలో పాటలు సృష్టించడం సాధ్యమవుతుందని చెప్పారు.
సరైన పదబంధాలతో రచించిన పాటల ద్వారా భావాలను వ్యక్తీకరించే అవకాశం లభిస్తుందని తెలిపారు. వీడియో రూపంలో ఈనెల 18న ఉ.8 గంటలకు వారి యూట్యూబ్ ఛానల్ (కిన్ని మ్యూజిక్ స్టూడియోస్) https://youtube.com/@ kinnimusicstudios ద్వారా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. హేమలత, సునీషా రెడ్డి ఏనుగు సంయుక్త నిర్మాణంలో రూపొందిన ’ఈ పిల్ల’ అనే ఈ పాటకి హర్ష నృత్యరీతులు సమకూర్చగా, చైతన్య దర్శకత్వం వహించారన్నారు. నీరజ్ కెమెరా, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, వంశీకృష్ణ, సరస్వతి చవాన్ నటించారన్నారు.