సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన తొలి పరీక్షలో బొటాబొటి మెజారిటీతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి 10 స్థానాలను దక్కించుకోగా, బీజేపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఒక స్థానం ఇండిపెండెంట్‌కు దక్కింది. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లలో ఒక్కో స్థానానికి ఈ నెల 10న ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా, మిగతా మూడింటిలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది.
ఈ ఉప ఎన్నికల్లో ఎక్కువ లాభం పొందిన పార్టీలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లే. ఈ పార్టీలు చెరో నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా మారినవే. ముగ్గురు స్వతంత్ర సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు అవసరమైనాయి. గతంలో వీరితోపాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. తాజా ఉప ఎన్నికల్లో ఆ ముగ్గురు ఇండిపెండెంట్లనే బీజేపీ బరిలోకి దించింది. డెహ్రా స్థానం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ముఖ్యమంత్రి సుక్కూ సతీమణి కమలా ఠాకూర్ ఘన విజయం సాధించారు.
ఈ నియోజక వర్గం ఏర్పాటైన తర్వాత గత పాతికేళ్లలో కాంగ్రెస్ ఇక్కడ గెలవడం ఇదే తొలిసారి. దీనితోపాటు నాలాఘర్ నియోజక వర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోని హమీర్‌పూర్‌లో మాత్రం బీజేపీ గెలుపొందింది. తాజా గెలుపుతో సీఎంగా సుక్కూ పదవి పదిలమైంది. 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న 40 సీట్లకు తిరిగి చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని నాలుగు సీట్లలోనూ పరాజయం పాలైన కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లోని మంగలౌర్, బద్రీనాథ్ స్థానాలనూ ఆ పార్టీ దక్కించుకుంది.
ఇక పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగుచోట్ల క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ మరోసారి రాష్ట్రంపై పట్టు చాటింది. పంజాబ్‌లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల బీజేపీలోకి ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యే షీతల్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన షీతల్‌పై ఆప్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం మాన్‌కు ఇది గొప్ప ఊరటే అని చెప్పాలి. ఇక, బీహార్‌లో ప్రధాన పార్టీలయిన జేడీ(యూ), ఆర్జేడీ అంచనాలను దెబ్బకొట్టి రూపౌలీలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా స్థానంలో బీజేపీ అభ్యర్థి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. తమిళనాడులోని విక్రావండిలో అధికార డీఎంకే అభ్యర్థి సునాయాసంగా గెలుపొందారు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల ప్రభావం చాలావరకు తర్వాత జరిగే ఎన్నికలపై ఉండడం సహజం. అయితే ఉప ఎన్నికల్లో ఫలితాలు స్థానిక పరిస్థితులనుబట్టి ఉంటాయని బీజేపీ ఎంతగా సమర్థించుకున్నా కేవలం నెల రోజులకే ఇటు తమిళనాడు మొదలుకొని అటు హిమాచల్‌దాకా ఫలితాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా రావడాన్నిబట్టి చూస్తే కమలనాథుల ప్రభ మసక బారిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమే అనిపిస్తుంది. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్ లాంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు పెద్ద బూస్ట్ అనే చెప్పాలి.