26-03-2025 12:23:13 AM
నిమ్స్ వైద్యుల ఘనత
హైదరాబాద్, మార్చి 25(విజయక్రాంతి) :నిమ్స్ వైద్యులు మరోసారి రికార్డు సృష్టించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొద టిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోబోటిక్ ద్వారా కిడ్నీ మార్పిడితో చేశారు. నిమ్స్ యూరాలజిస్టులు రొబోటిక్ సర్జరీ ద్వారా కిడ్నీ మార్పిడి చేసి తమ ప్రత్యేకతను చాటారు. ప్రభుత్వ వైద్యశాలలో ఈ ఘటన అత్యంత అరుదైనదిగా వైద్యాధికారులు తెలిపారు.
నల్గొండకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి దాదాపు ఒక దశాబ్దం పాటు ఎండ్-స్టేజ్ మూత్రపిండ వ్యాధితో పోరాడుతున్నాడు. 2017లో ప్రత్యక్ష-సంబంధిత మూత్రపిండ మార్పిడి చేయించుకున్నా అది వైఫల్యం చెందింది. దీంతో మరోసారి కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. బ్రెయిన డెడ్ అయిన వ్యక్తి కిడ్నీని అమర్చేందుకు వైద్యులు సిద్ధమైనా సర్జరీ చాలా సంక్షిష్టంగా మారింది.
ఈ తరుణంలోనే వైద్యులు దక్షిణాదిలోనే మొట్టమొదటి సారిగా ఓ ప్రభుత్వ వైద్యశాలలో (నిమ్స్) రొబోటిక్ సర్జరీ ద్వారా కిడ్నీ మార్పిడి విజయవంతంగా చేశారు. నిమ్స్ లోని యూరాలజీ, మూత్రపిండ మార్పిడి విభాగం ఈ ఏడాది ఇప్పటి వరకు 41 మూత్రపిండ మార్పిడిలను నిర్వహించింది. కాగా ఇప్పటి వరకు మొత్తం కిడ్నీ మార్పిడిల సంఖ్య దాదాపు 2వేలు. ఏటా దాదాపు 11,000 ఇతర యూరాలజికల్ శస్త్రచికిత్సలను నిమ్స్ వైద్యులు నిర్వహిస్తారు.
ఇప్పుడు రొబోటిక్ టెక్నాలజీ పరిచయం కావడంతో భవిష్యత్తులో అత్యంత ఖచ్చితత్వంగా సర్జరీలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రధాన యూరాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. రొబోటిక్ సర్జరీకి రాహుల్ దేవరాజ్, సీనియర్ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ డా. రామ్ రెడ్డి,అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డాక్టర్ ధీరజ్, నాయకత్వం వహించారు.
పలువురు వైద్యుల బృందం వారికి సహకరించింది. నిమ్స్ వైద్యం ప్రపంచస్థాయికి తీసుకుపోయిన యురాలజిస్టుల బృందానికి నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప అభినందనలు తెలిపారు. కాగా... కిడ్నీ మార్పిడిని తెలంగాణ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేశారు.